IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్‌మాల్.. వైరల్‌గా మారిన కమిషనర్‌ కృష్ణతేజ వార్నింగ్‌..

Ias Krishna Teja

Ias Krishna Teja

IAS Krishna Teja: కాకినాడ జిల్లాలోని 61 గ్రామ పంచాయతీల్లో రూ.1.91 కోట్ల ప్రజాధనంలో అక్రమాలు జరిగినట్లు గుర్తించిన పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై జిల్లా ఇన్‌చార్జి డీపీవో లక్ష్మణ్‌తో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టెలి కాన్ఫరెన్స్ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజలు ప్రభుత్వంపై నమ్మకంతో పన్నులు చెల్లిస్తున్నారని, ఆ నమ్మకాన్ని అధికారులు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, “పబ్లిక్ డబ్బులు ముట్టుకుంటే చేతులు కాలిపోతాయి” అంటూ తీవ్ర హెచ్చరిక చేశారు.

కాకినాడ రూరల్ మండలంలోని రమణయ్యపేట గ్రామ పంచాయతీలో డీజిల్ ఖర్చుల పేరుతో రూ.20 లక్షలు డ్రా చేసిన అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన కమిషనర్ కృష్ణతేజ.. దీనిపై వెంటనే క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అక్రమంగా చెల్లించిన బిల్లులను వెనక్కి రప్పించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే, అక్రమ బిల్లుల ద్వారా నిధులు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 61 మంది పంచాయతీ కార్యదర్శులను వెంటనే పిలిపించి పూర్తి నివేదిక సమర్పించాలని జిల్లా అధికారులను కమిషనర్ కృష్ణతేజ ఆదేశించారు. ప్రజాధనాన్ని కాపాడటంలో ఎలాంటి రాజీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. కమిషనర్ కృష్ణతేజ చేసిన ఈ వ్యాఖ్యలు, అధికారులకు ఇచ్చిన హెచ్చరికలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారాయి.