Janasena Formation Day LIVE: జనసేన 12 ఏళ్ల పండుగ వైభవంగా సాగుతోంది.. ఈ బహిరంగసభ వేదికగా పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. 90 నిమిషాల పాటు ప్రసంగించనున్నారు.. ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్.. కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైన తర్వాత తొలి ఆవిర్భావ దినోత్సవం ఇదే కావడంతో.. ప్రాధాన్యత ఏర్పడింది.. జనసేన 12 ఏళ్ల ప్రస్థానం, విజయాలతో డాక్యుమెంటరీ ప్రదర్శించనున్నారు.. భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు పవన్ కల్యాణ్…
-
హిందీ వద్దంటే కుదరదుః పవన్
ఈ నడుమ హిందీ వద్దు అనే కొత్త నినాదాలు మొదలు పెట్టారు. కానీ అలా అంటే కుదరదు. హిందీ అందరూ నేర్చుకోవాలి. అది మన అభివృద్ధికి ఉపయోగపడుతుంది. మన సినిమాలను ఉత్తర ప్రదేశ్, బీహార్ లో కూడా రిలీజ్ చేసి అక్కడి డబ్బులు తీసుకుంటున్నాం. మరి హిందీ వద్దు అంటే వాళ్ల డబ్బులు ఎందుకు మనకు.
-
హిందువులను చంపేస్తామంటే కోపం రాదాః పవన్ కల్యాణ్
చాలా మంది నేను సెక్యులర్ నుంచి సనాతన ధర్మానికి మారిపోయాను అనుకుంటున్నారు. నేను మొదటి నుంచి సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాను. పాతబస్తీలో ఒక నేత ఒక గంట టైమ్ ఇస్తే హిందువులను చంపేస్తామంటే మాకు కోపం రాదా. మా రాముడి తలను నరికేస్తామంటే మాకు కోపం రావొద్దంటే ఎలా. అల్లాను, ఏసుక్రీస్తును నిందిస్తే బతకనిస్తారా.. మరి హిందూ దేవుళ్లను తిడితే ఊరుకోవాలా. ఆ రోజులు ఎప్పుడో పోయాయి. హిందువుల జోలికి వస్తే ఊరుకోం.
-
నన్ను కాపాడమని ప్రధానిని అడగనుః పవన్
గత ఐదేళ్లలో జనసేనను చాలా ఇబ్బందులు పెట్టారు. అప్పుడు మా ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా అరెస్టులు చేశారు. అప్పుడు నన్ను కొందరు జనసేన నేతలు ప్రధానికి ఫోన్ చేసి హెల్ప్ అడగమన్నారు. కానీ నేను ఎన్నడూ ప్రధానిని కాపాడమని అడగలేదు.. అడగను. ఎందుకంటే నేను ప్రజలను కాపాడటానికి వచ్చాను. అంతే తప్ప నన్ను కాపాడమని ప్రధానిని అడగడానికి రాలేదు. ఈ పదేళ్లలో చాలా సార్లు కిందపడ్డా తిరిగి లేచి నిలబడ్డాం. అందుకే వందశాతం స్ట్రైక్ రేట్ సాధించాం.
-
భిన్న మనుషుల్లో ఏకత్వమే నా ఐడియాలజీః పవన్
నేను రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో ఏడు సిద్ధాంతాలు ప్రకటించాను. అప్పుడు నన్ను చాలా మంది అడిగారు. నీకు ఇంత కన్ఫ్యూషన్ ఉంది.. నీ ఐడియాలజీ ఏంటి అన్నారు. నేను ఒక్కటే చెప్పాను. ఇంత మంది భిన్నమైన మనుషుల్లో ఏకత్వాన్ని చూడటమే నా ఐడియాలజీ. అందరినీ ఏకం చేసి నడిపించడం కోసమే పార్టీని పెట్టాను. ఊరికే ఏడు సిద్ధాంతాలు పెట్టలేదు. మనుషులను ఒక్కటి చేయడమే నా ముఖ్య ఉద్దేశం.
-
టాలీవుడ్ హీరోల అభిమానులకు ధన్యవాదాలుః పవన్ కల్యాణ్
పిఠాపురం సభకు హెలికాఫ్టర్ లో వస్తుంటే టాలీవుడ్ హీరోల పోస్టర్లు కనిపించాయి. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేశ్ బాబు, చిరంజీవి, రామ్ చరణ్. సాయిధరమ్ తేజ్ అభిమానులకు నా ప్రత్యేక నమస్కారాలు, ధన్యవాదాలు. మీ అందరి మద్దతు నాకు ఎప్పుడూ ఉంటుందని కోరకుంటున్నాను.
-
జనసేన జన్మస్థలం తెలంగాణ.. కర్మస్థానం ఏపీః పవన్ కల్యాణ్
జనసేన పార్టీ జన్మస్థానం తెలంగాణ అయితే.. కర్మస్థానం ఆంధ్రప్రదేశ్. తెలంగాణ అంటే నాకు ఎంతో గౌరవం. అక్కడి నుంచి వచ్చిన అభిమానులకు, పార్టీ నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణతో జనసేనకు విడదీయరాని అనుబంధం ఉంది.
-
గద్దర్ నన్ను ఏరా తమ్ముడూ అని పిలిచేవాడుః పవన్
పవన్ కల్యాణ్ పిఠాపురంలో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నేత దివంత గద్దర్ మీద తన ప్రేమను చాటుకున్నారు. గద్దర్ పాటిన బండెనక బండి గట్టి అనే పాటను పాడారు. తాను ఎక్కడ కనిపించినా గద్దర్ తనను ఏరా తమ్ముడూ అంటూ పిలిచేవాడు అంటూ చెప్పుకొచ్చారు. ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం అంటూ గుర్తు చేసుకున్నారు.
-
నాకు పునర్జన్మనిచ్చింది తెలంగాణః పవన్ కల్యాణ్
తెలంగాణలో కరెంట్ షాక్ వచ్చి తాను చనిపోయే సమయంలో తనకు కొండగట్టు ఆంజనేయ స్వామి, తెలంగాణ నేల పునర్జన్మను ఇచ్చిందని చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్. అలాంటి తెలంగాణకు కోటి నమస్కారాలు అంటూ ఎమోషనల్ అయ్యారు. తెలంగాణ నుంచి వచ్చిన జనసైనికులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
-
నన్ను తిట్టని తిట్టు లేదు.. అసెంబ్లీ గేటు బద్దలు కొట్టుకుంటూ వచ్చాః పవన్ కల్యాణ్
ఏపీ అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం అంటూ తనను అవమానించారని.. అలాంటిది అసెంబ్లీ గేటు బద్దలు కొట్టుకుంటూ వందశాతం స్ట్రైక్ రేట్ సాధించామని పవన్ కల్యాణ్ అన్నారు. గత ఐదేండ్లు ఏపీలో హింసను సాగించారని.. ప్రతిపక్షాలను వేధించారంటూ చెప్పారు. తనను వైసీపీ నేతలు తిట్టని తిట్టు లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
-
ఒక్కడిగా మొదలుపెట్టా.. ఈ స్థాయికి వచ్చాంః పవన్ కల్యాణ్
పిఠాపురంలో జనసేన 12వ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగం స్టార్ట్ అయింది. తాను ఒక్కడిగా 2014లో ప్రయాణం మొదలు పెట్టానని.. ఈ రోజు ఈ స్థాయి దాకా వచ్చామంటూ చెప్పుకొచ్చారు. ఆయన ప్రసంగం ముందు హిందీలో ఒక పద్యం చెప్పారు. భయం లేదు కాబట్టే ఈ స్థాయి దాకా ఎదిగామంటూ దాని అర్థం చెప్పుకొచ్చారు.
-
పవన్ కల్యాణ్ జాతీయ నేతగా ఎదగాలిః మంత్రి నాదెండ్ల
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జాతీయ నేతగా ఎదగాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా పవన్ ఒకేలా ఉన్నారన్నారు. పవన్ కల్యాన్ ప్రజలకు ఎక్కడ కష్టం వచ్చినా అందరికన్నా ముందుగా స్పందించారని.. ఇక ముందు కూడా అలాగే ఉంటారంటూ చెప్పుకొచ్చాడు.
-
నేను పార్టీలోకి వచ్చినప్పుడు పవన్ చెప్పింది అదేః నాదెండ్ల మనోహర్
జనసేన పార్టీ చాలా కష్టాల నుంచి పైకి వచ్చిందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. 2017లో తాను పార్టీలో జాయిన్ అయినప్పుడు పార్టీకి భవిష్యత్ లేదనే మాటలు వినిపించాయన్నారు. అప్పుడు పవన్ తనతో ఒకటే చెప్పారని.. యువతను అద్భుతమైన నాయకత్వంగా మార్చుకుంటే చాలు అన్నారన్నారు. అదే నేడు పార్టీని ఇలా నిలబెట్టిందన్నారు.
-
ఆవిర్భావ సభకు చేరుకున్న పవన్ కల్యాణ్
పిఠాపురంలో జరుగుతున్న 12వ ఆవిర్భావ సభకు అధినేత పవన్ కల్యాణ్ చేరుకున్నారు. ఆయనకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలు అందరూ మాట్లాడారు. ఇక పవన్ రాకతో సంబురాలు ఆకాశాన్ని అంటాయి. పవన్ నుదిటన తిలకంతో ఎంట్రీ ఇవ్వడం అందరినీ ఆకట్టుకుంది.
-
నా ఆస్తులు జగన్ కాజేశాడుః బాలినేని శ్రీనివాస్ రెడ్డి
పిఠాపురం జనసేన ఆవిర్భావ సభలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన ఆస్తులు, తన వియ్యంకుడి ఆస్తులను మాజీ సీఎం జగన్ కాజేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. తన కుటుంబాన్ని జగన్ చాలా ఇబ్బంది పెట్టారని.. అందుకు చాలా బాధపడ్డట్టు చెప్పుకొచ్చారు. తనకు పవన్ అండగా ఉంటానని హామీ ఇచ్చారని.. పదవి వచ్చినా రాకపోయినా జనసేనలోనే ఉంటానని చెప్పుకొచ్చారు.
-
జగన్ నాకు తీవ్ర అన్యాయం చేశాడుః మాజీ మంత్రి బాలినేని
మాజీ సీఎం జగన్ తనకు తీవ్ర అన్యాయం చేశాడని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ తన మంత్రి పదవి తీసేశాడని.. అయినా సరే తాను బాధపడలేదన్నారు. పిఠాపురం జనసేన ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. తనను జనసేనలోకి తీసుకొచ్చింది నాగబాబు అన్నారు. పవన్ కల్యాణ్ వెంట తాను నడుస్తానని.. ఎలాంటి పదవులు ఆశించి జనసేనలోకి రాలేదన్నారు. జనసేన కోసం ఒక మంచి కార్యకర్తగా పనిచేస్తానని వివరించారు.
-
పవన్ కల్యాణ్ స్థాయికి నేను ఎదగలేనుః నాగబాబు
పవన్ కల్యాణ్ చాలా గొప్ప వ్యక్తి అని నాగబాబు ప్రశంసించారు. 'అతను చాలా ఎత్తుకు ఎదిగాడని.. వీలైతే పవన్ కల్యాణ్ స్థాయికి ఎదగడానికి ప్రయత్నించాలి. లేదంటే అంత గొప్ప వ్యక్తికి సేవకుడిగా ఉండాలి. నేను పవన్ అంత ఎత్తుకు ఎదగలేను. అందుకే సేవకుడిగా ఉండిపోయాను' అంటూ నాగబాబు చెప్పుకొచ్చారు.
-
పవన్ గెలుపు ఒక వ్యక్తి వల్ల రాలేదుః నాగబాబు
పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపుపై నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ పిఠాపురంలో పోటీ చేసినప్పుడు జనసేన కార్యకర్తలు, ప్రజలు కీలకంగా పనిచేశారన్నారు. అంతే తప్ప ఎవరో ఒక వ్యక్తి వల్ల వచ్చింది కాదన్నారు. అలా తన వల్లే పవన్ గెలిచాడు అని ఎవరైనా అనుకుంటే అది వారి ఖర్మ అంటూ విమర్శలు గుప్పించారు.
-
జగన్ ఇంకో 20ఏళ్లు పడుకో.. మేం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం: నాగబాబు
జనసేన 12వ ఆవిర్భావ సభలో పార్టీ అగ్రనేత నాగబాబు మాట్లాడుతూ వైసీపీపై సెటైర్లు వేశారు. ఎన్నికలకు ముందు మాజీ సీఎం జగన్ నిద్రలోకి వెళ్లిపోయారని.. ఇంకా ఆ నిద్ర నుంచి బయటకు రాలేదని చెప్పారు. అప్పుడప్పుడు ఆయన మాటలు చూస్తే నిద్రలో కలవరిస్తున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి జగన్ ఇంకో 20 ఏళ్లు నువ్వు పడుకో.. మేం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం అంటూ సెటైర్లు వేశారు.
-
12వ ఆవిర్భావ దినోత్సవం పుష్కరాల లాంటిదిః నాగబాబు
మన హిందూ ప్రజలకు 12వ ఏడాది చాలా స్పెషల్ అని నాగబాబు చెప్పుకొచ్చారు. 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తుంటాయని.. ఈ 12వ ఆవిర్భావ సభ కూడా జనసేనకు పుష్కరాల్లాంటిదేనన్నారు. ఈ సభ గతంలో జరిగిన చాలా సభలకంటే చాలా గొప్పది అంటూ చెప్పుకొచ్చారు.
-
పవన్ కు జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలుః పురంధేశ్వరి
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు, జనసేన నేతలకు స్పెషల్ విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు.
-
పిఠాపురం చేరుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం చేరుకున్నారు. పిఠాపురంలో జరుగుతున్న జనసేన 12వ ఆవిర్భావ సభకు ఆయన మరికొద్ది సేపట్లో వెళ్తారు. హెలికాప్టర్ ద్వారా ఆయన పిఠాపురం వెళ్లారు. సభకు ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలు చేరుకున్నారు.
-
జ్యోతి ప్రజ్వలన చేసిన వీరమహిళలు
పిఠాపురంలో జరుగుతున్న జనసేన 12వ ఆవిర్భావ సభ ప్రారంభం అయింది. ఈ సందర్భంగా రాజావారి ద్వారం నుంచి వచ్చిన వీరమహిళలను ముందుగా స్టేజి మీదకు ఆహ్వానించారు. వారితో జ్యోతి ప్రజ్వలన చేయించి సభను ప్రారంభించారు. అనంతరం వారంతా జై జనసేన నినాదాలు చేశారు. అనంతరం గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.
-
జనసేనకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలుః చంద్రబాబు
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పిఠాపురంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆ పార్టీకి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. జనసేన ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలను ఈ సందర్భంగా అభినందించారు. పవన్ తో ఉన్న ఫొటోలను పంచుకున్నారు.
-
పిఠాపురం జనసేన సభ వద్ద ఉద్రిక్తత
పిఠాపురం జనసేన సభ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. సభ వద్దకు వచ్చిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు డొక్కా సీతమ్మ ద్వారం నుంచి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుని రాజావారి ద్వారం నుంచి వెళ్లాలని సూచించారు. దీంతో ఎమ్మెల్యేకు వారికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బారికేడ్లను తోసుకుంటూ ఎమ్మెల్యే, అతని అనుచరులు లోపలకు వెళ్లారు.
-
90 నిముషాల పాటు పవన్ స్పీచ్
పిఠాపురంలో జరుగుతున్న జనసేన 12వ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ 90 నిముషాల పాటు మాట్లాడుతారు. ఇందులో 12 ఏళ్లుగా జనసేన చేసిన పోరాటాలు, సాధించిన విజయాల గురించి మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. అలాగే భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించబోతున్నారు.
-
జనసేన ఆవిర్భావ సభకు మూడు ద్వారాలు.
జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు వెళ్లడానికి మూడు ద్వారాలు.. పిఠాపురం రాజావారి ద్వారం నుంచి పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకా, వీర మహిళలు పాస్‌లకు ఎంట్రీ.. డొక్కా సీతమ్మ ద్వారం నుంచి వీఐపీ, వీవీఐపీ పాస్‌లకు.. మల్లాడి సత్యలింగం నాయకర్ ద్వారం నుంచి జనసేన కార్యకర్తలకు ఎంట్రీ కాావాల్సి ఉంటుంది.
