Huge Demand for Kosa Meat: సంక్రాంతి పండుగ నేపథ్యంలో కాకినాడ జిల్లాలో పందెం కోళ్లకు అనూహ్యమైన డిమాండ్ నెలకొంది. పందాల బరిలో ఓడిపోయిన కోళ్లు ఇప్పుడు కోస మాంసం రూపంలో భారీగా అమ్ముడుపోతున్నాయి. పందెం కోళ్ల మాంసం రుచిగా, పౌష్టికంగా ఉంటుందనే నమ్మకంతో జనం ఎగబడుతున్నారు. పందెం కోసం నెలల తరబడి కోళ్లను ప్రత్యేకంగా పెంచుతారు నిర్వాహకులు. బలమైన ఆహారం, వ్యాయామంతో కోడిని తీర్చిదిద్దుతారు. అయితే బరిలో ఓడిపోయిన కోళ్లకు ఇప్పుడు కొత్త గుర్తింపు వచ్చింది. వీటి మాంసం కోసం ప్రజలు ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో ఓడిపోయిన పందెం కోడి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ధర పలుకుతోంది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఈ కోస మాంసం దొరకడం వల్ల డిమాండ్ మరింత పెరిగింది.
Read Also: Priya Kapoor: రూ.30 వేల కోట్ల ఆస్తి వివాదం.. సుప్రీంకోర్టు మెట్లేక్కిన వ్యాపారవేత్త రెండో భార్య!
కాకినాడతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచే కాకుండా, ఇతర ప్రాంతాల్లో ఉన్న తమ బంధువులకు కూడా ఈ మాంసాన్ని పంపిస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. డిమాండ్ పెరగడంతో పందాల బరుల దగ్గరే కోస మాంసం డ్రెస్సింగ్ కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. అక్కడికక్కడే శుభ్రపరచి మాంసాన్ని ప్యాక్ చేసి ఇస్తున్నారు. దీంతో కొనుగోలుదారులకు సౌకర్యంగా మారింది.. పందెం కోళ్ల మాంసానికి ఉన్న క్రేజ్ వల్ల పందాలు ముగిసిన తర్వాత కూడా బరుల వద్ద సందడి కొనసాగుతోంది. ఓడిపోయిన కోడే అయినా.. కోస మాంసంగా మారితే బంగారం లాంటి విలువ వస్తోందని స్థానికులు చెబుతున్నారు..
