Jogi Ramesh Ushasri Shankar Narayana Reacts On Pawan Kalyan Comments: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఏపీ మంత్రి జోగి రమేష్ ఘాటు విమర్శలు చేశారు. 20వ తేదీన అవనిగడ్డలో జరిగే ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చిన ఆయన.. సినిమా షూటింగులు లేకే పవన్ మంగళగిరిలో తిరుగుతున్నాడని సెటైర్లు వేశారు. విశాఖలో ఉత్తరాంధ్ర ప్రజలకు మద్దతుగా వెళ్లిన పవన్, జనసైనికులు.. తమపై సైకోల్లాగా దాడులు చేశారని ఆరోపణలు చేశారు. ఏ ఒక్కరితోనూ పొత్తు పెట్టుకోకుండా జనసేన పార్టీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయగలుగుతుందా? అని ప్రశ్నించారు. అలాగే.. ‘నేను ముఖ్యమంత్రిని అని చెప్పుకునే దమ్ము ధైర్యం నీకు ఉందా?’ అని పవన్‌కు సవాల్ విసిరారు. చంద్రబాబు చంకలో దూరిపోయే నువ్వు సీఎం అవుతావా? చెంచాగిరి చేస్తావా? అని విమర్శించారు. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు దొరకని నువ్వు, 60 నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేని తెలుగుదేశం పార్టీతో పాటు ఇంకో నాలుగు పార్టీలు కలిసినా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటని కదిలించలేరని జోగి రమేష్ తేల్చి చెప్పారు.
ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ‘చెప్పుతో కొడతానంటూ’ చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఉషశ్రీ కౌంటర్ ఎటాక్ చేశారు. ‘మా ఎమ్మెల్యేలను కాదు.. కనీసం మా కార్యకర్తలను టచ్ చేసి చూడు ఏం జరుగుతుందో?నని హెచ్చరించారు. రాష్ట్రంలో రౌడీయిజంకు పవన్ నాంది పలుకుతున్నాడన్నారు. నోటికి ఎదిపడితే అది మాట్లాడితే.. ఇక్కడ చూస్తూ ఎవ్వరూ ఊరుకోరని వార్నింగ్ ఇచ్చారు. చెప్పు చూపిస్తూ పార్టీ ఆఫీస్‌లో మాట్లాడిన మాటలు.. పవన్ దిగజారుడు వ్యాఖ్యలకు నిదర్శనమని అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని.. వైజాగ్ గర్జన సక్సెస్ కావడం చూసి జీర్ణించుకోలేక, పవన్‌తో చంద్రబాబు ఈ కొత్త నాటకానికి తెరలేపారని ఆరోపించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే శంకరనారాయణ కూడా పవన్ వ్యాఖ్యలకు స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై రాష్ట్ర పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ గర్జన జరిగిన రోజే పవన్ ఎందుకు సమావేశం పెట్టుకోవలసి వచ్చిందని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి చంద్రబాబు డైరెక్షనేనని అభిప్రాయపడ్డారు. వైసిపి వారు కనుసైగా చేస్తే రాష్ట్రంలో నువ్వు తిరగగలవా? అని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలు నిన్ను బట్టలూడదీసి పిచ్చికుక్కొని కొట్టినట్టు కొట్టే రోజులు దగ్గరలొనే ఉన్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
