Jogi Ramesh Gives Clarity On Early Elections In AP: చంద్రబాబు కొత్తగా ముందస్తు డ్రామా మొదలు పెట్టారని.. ఆయన చెప్తున్నట్టు ముందస్తు ఎన్నికలు రావని ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ స్పష్టం చేశారు. చచ్చిపోయినా.. వెంటిలేటర్‌పై టీడీపీని లేపేందుకు టీడీపీ మీడియా తెగ తాపత్రయ పడుతోందని విమర్శించారు. కళ్ళు ఉన్నా చూడలేని కబోదులు వీరని ధ్వజమెత్తారు. మూడు సెంట్ల స్థలం ఇచ్చి, పూర్తిగా ఇళ్ళు కట్టిస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు ఓ చరిత్ర హీనుడని వ్యాఖ్యానించారు. కానీ సీఎం జగన్ చంద్రబాబులా కాదని.. 31 లక్షల మంది మహిళలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చి, ఇంటి పట్టాలు చేతిలో పెట్టిన వ్యక్తి జగన్ అని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇళ్ల నిర్మాణాల పురోగతిపై చర్చకు సిద్ధమా? అంటూ చంద్రబాబు, లోకేష్‌లకు సవాల్ విసిరారు. జగనన్న కాలనీలకు ఆ ఇద్దరు రావాలని ఛాలెంజ్ చేశారు.
మొన్నటివరకు ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోతోందని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు ప్లేటు ఫిరాయించారని జోగి రమేశ్ పేర్కొన్నారు. జగన్ అందిస్తున్న పథకాలను తానూ కొనసాగిస్తానని చంద్రబాబు అంటున్నారని.. ఈ లెక్కన జగన్ అడుగు జాడల్లో చంద్రబాబు అడుగులు వేస్తాను అన్నట్లే కదా అని చెప్పారు. యనమల వ్యవహారం చూస్తోంటే.. పచ్చ కామెర్లు వచ్చిన వాళ్లకు అంతా పచ్చగా కనిపిస్తున్నట్లుందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు వెన్నుపోటు పాపంలో యనమల కూడా ఓ భాగస్వామి అని ఆరోపించారు. చంద్రబాబు వెన్నుపోటుకు వాడిన పదునైన కత్తి యనమల అని చెప్పారు. చంద్రబాబు, యనమల తమ ఆస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమా? స్టే తెచ్చుకోకుండా ఉండగలరా? అని నిలదీశారు. వచ్చే 2024 ఎన్నికల్లో వన్ సైడ్ వార్ జరగబోతోందని.. కచ్ఛితంగా తమ వైసీపీనే మరోసారి అధికారంలోకి వస్తుందని మంత్రి జోగి రమేశ్ ధీమా వ్యక్తం చేశారు.
