రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో పార్టీ పరిస్థితి, పార్టీ శ్రేణుల దుస్థితిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. పార్టీలో కాకరేపారు.. కొందరని ఉద్దేశిస్తూ పరోక్షంగా జేసీ కామెంట్లు చేయడంతో ఆ నేతలను నొచ్చుకున్న పరిస్థితి.. ఈ నేపథ్యంలో పెద్దపప్పూరు మండలం జూటూరులోని తోటలో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని కలిశారు శింగనమల తెలుగుదేశం పార్టీ నేతలు.. ఈ సందర్భంగా జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఏ పార్టీలోనైనా విబేధాలు సహజం.. భిన్నాభిప్రాయాలు ఉంటాయన్న ఆయన.. పార్టీకి హాని కలిగే విబేధాలు ఉన్నాయని నేను అనుకోవడంలేదన్నారు. రెండేళ్లుగా సైలెంట్‌గా ఉన్నారు.. అన్ని గమనిస్తున్నాను.. టీడీపీ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేశారు.
పార్టీకి నష్టం కలిగించే స్థాయిలో టీడీపీలో విభేదాలు లేవన్నారు జేసీ దివాకర్‌రెడ్డి.. రాష్ట్రంలోని 75 మున్సిపాలిటీలలో ఒక్క తాడిపత్రి మున్సిపాల్టీలో మాత్రం తెలుగుదేశం పార్టీ విజయం సాధించిందని గుర్తుచేసిన ఆయన.. అనంతపురం జిల్లాలో ఎక్కడా రెండు కౌన్సిలర్ స్థానాలు కూడా టీడీపీ గెలుచకపోవడం దురదృష్టకరం అన్నారు.. నా దగ్గరకు టీడీపీ కార్యకర్తలు ఎందుకు వచ్చారో తెలియదన్న ఆయన.. తన వద్దకు ఎవరు వచ్చినా బాగోగులు అడుగుతానే తప్ప రాజకీయాలపై చర్చించడం జరగలేదన్నారు.. అయితే, జరుగుతున్న పరిణామాలపై పార్టీ పెద్దలే సమాధానం చెప్పాలని కామెంట్ చేశారు జేసీ దివాకర్‌రెడ్డి.