ఈనెల 18న హోలీ పండగను పురస్కరించుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయుల ఐక్యతకు ప్రతీకగా నిలిచే హోలీని దేశ ప్రజలందరూ ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. హోలీ వేడుకల ప్రాశస్త్యాన్ని ప్రస్తావిస్తూ ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.
వసంత రుతువు వేళ వచ్చే హోలీని వసంతోత్సవంగా కూడా పిలుస్తారని పవన్ పేర్కొన్నారు. వేర్వేరు ప్రాంతాల ప్రజలు హోలీ వేడుకలను వేర్వేరు రీతుల్లో జరుపుకుంటారని ఆయన తెలిపారు. రంగులు, పూల సమ్మేళనంగా నిర్వహించుకునే ఈ హోలీ వేడుకల సందర్భంగా ప్రజల జీవితాల్లో మంచి ఆరోగ్యం, సుఖశాంతులు వెల్లివిరియాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. హోలీ వేడుకలను సహజసిద్ధమైన రంగులతోనే నిర్వహించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
