Janasena Party: విశాఖ ఎయిర్‌పోర్టులో మంత్రులపై దాడి ఘటన విషయంలో హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విశాఖ కేంద్ర కారాగారం నుంచి 9 మంది జనసేన నేతలు విడుదలయ్యారు. ఈ మేరకు కేంద్ర కారాగారం వద్ద సెక్షన్ 30ని పోలీసులు అమలు చేస్తున్నారు. దీంతో జనసేన కార్యకర్తలు, అభిమానులు రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. కాగా తమకు బెయిల్ మంజూరు చేసిన రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానానికి జనసేన నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. తమకు మద్దతు ఇచ్చి అహర్నిశలు సహకరించిన న్యాయవాదులకు, జనసేన లీగల్ సెల్ ప్రతినిధులకు జనసేన నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు.
Read Also: Sunil Deodhar: సునీల్ దేవధర్ కీలక వ్యాఖ్యలు.. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉండదు
కాగా తాము చట్టబద్ధంగానే పోరాటం కొనసాగిస్తామని జనసేన పీఏసీ సభ్యుడు కోన తాతారావు స్పష్టం చేశారు. ప్రజల పక్షాన ఎప్పటికీ నిలబడతామని.. ఒత్తిళ్లకు, బెదిరింపులకు తలొగ్గేది లేదన్నారు. పోలీస్ వ్యవస్థను ఉపయోగించి తమపై అణచివేతకు పాల్పడ్డారన్నారు. న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని కాపాడిందని పేర్కొన్నారు. తాము అమాయకులమని.. తమను బలవంతంగా జైలులో పెట్టారని జనసేన భీమిలి ఇంఛార్జ్ పంచకర్ల సందీప్ అన్నారు. క్రిమినల్స్ రాజ్యమేలుతోంటే అమాయకులను జైలులో వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ కేసులను చట్టబద్ధంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.