Site icon NTV Telugu

Janasena Janavani: సామాన్యుడి గళం వినిపించేలా జనసేన ‘జన వాణి’

Nadendla Manohar

Nadendla Manohar

జనసేన వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ప్రజల సమస్యలను ఆసాంతం విని… ప్రభుత్వానికి బలంగా తెలిపేలా వినూత్న కార్యక్రమం వుంటుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. బాధిత పక్షాల నుంచి స్వయంగా పవన్ కళ్యాణ్ అర్జీలు స్వీకరిస్తారు. కష్టాల్లో ఉన్న జన సామాన్యానికి జనసేన భరోసా ఇస్తుందన్నారు. జూలై 3వ తేదీన విజయవాడలో ‘జన వాణి’కి శ్రీకారం చుట్టబోతున్నామన్నారు మనోహర్. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా… సామాన్యుడి గళం వినబడేలా జనసేన పార్టీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి ‘జనవాణి’ అనే పేరుని ఖరారు చేశారు పవన్ కల్యాణ్. వరుసగా వచ్చే ఐదు ఆదివారాలు ప్రజలకు ప్రత్యక్షంగా అందుబాటులో ఉండి… సమస్యలతో సతమతం అవుతున్న బాధిత పక్షాల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరిస్తారు.

ఈ కార్యక్రమాన్ని జులై 3 తేదీన విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో ప్రారంభిస్తారు. గతంలో ప్రభుత్వాలు ప్రజల పక్షాన నిలబడి, ప్రజా సమస్యలు పరిష్కారమయ్యే విధంగా కార్యక్రమాలు చేపట్టేవి. ముఖ్యమంత్రులు ప్రజల బాధలు విని అర్జీలు తీసుకొనేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో ముఖ్యమంత్రికి అర్జీ ఇచ్చే అవకాశం సామాన్యుడికి లేకుండా పోయింది. జిల్లాల్లో కలెక్టర్లు నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం కూడా తూతూ మంత్రంగా సాగుతోంది. కనీసం ప్రజాప్రతినిధులు నిర్వహిస్తున్న గడప గడపకు కార్యక్రమంలోనైనా ప్రజా సమస్యలు విని, వాటిని పరిష్కారిస్తారంటే ఆ పరిస్థితి ఎక్కడ కూడా కనిపించడం లేదు. గడప గడపకు కార్యక్రమంలో ఎవరైతే ప్రజాప్రతినిధులను సమస్యలపై నిలదీస్తున్నారో వాళ్లపై కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు నాదెండ్ల మనోహర్. ఇటీవల ప్రకాశం జిల్లా నుంచి ఒక వికలాంగ దళిత మహిళ… తన స్థలాన్ని ఆక్రమించి వైసీపీ నాయకులు భవనం నిర్మించారని ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం ఇద్దామని ప్రయత్నించి విఫలమయ్యింది. ఆమె వస్తుంటే కలవనీయకుండా ఆటంకాలు కలిగించారు. ఇది తెలిసి చలించిపోయిన పవన్ కళ్యాణ్ గారు ‘జనవాణి – జనసేన భరోసా’ కార్యక్రమాన్ని రూపొందించారు.

జులై 3వ తేదీ ఉదయం 10 గంటలకు విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజలకు పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండి వచ్చిన అర్జీలని స్వీకరిస్తారు. పార్టీ ప్రతినిధులు అక్కడే రసీదు అందచేస్తారు. సాయంత్రానికల్లా సంబంధిత అధికారులకు సమస్యలు చేరేటట్లు ప్రయత్నం చేస్తారు. మరుసటి రోజు నుంచి సమస్య పరిష్కారమయ్యే విధంగా పార్టీ కార్యాలయం నుంచి ఫాలో అప్ చేస్తారు. రాజకీయాలకు అతీతంగా, సామాన్యుడికి న్యాయం జరిగే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. పవన్ కళ్యాణ్ కి సమస్య విన్నవించుకుంటే న్యాయం జరుగుతుందనే నమ్మకం ప్రజల్లో ఉంది. దాన్ని బలపరిచే విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి సమస్యను చెప్పుకోవాలనుకునే ఎవరైనా ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ ని కలిసి తమ సమస్యను విన్నవించుకోవచ్చు. తొలి రెండు ఆదివారాలు విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. తరువాత ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఉభయగోదావరి ప్రాంతాల్లో కార్యక్రమాలు ఉంటాయి. సమస్యలతో సతమతమవుతున్న సామాన్యుడి ఆవేదనను, అతని గొంతును ఈ కార్యక్రమాల ద్వారా కచ్చితంగా బలంగా వినిపిస్తాం అని వివరించారు నాదెండ్ల మనోహర్.

ONGC: అరేబియా సముద్రంపై హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్..

Exit mobile version