మరికొద్ది గంటల్లో మనమంతా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముందుగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నూతన సంవత్సర శుభాకాంక్షలను సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. నూతనం… ప్రారంభం.. ఆరంభం.. అనే పదాలలోనే ఒక ఉత్తేజం నిండి ఉంటుందని… అటువంటిది కొత్త సంవత్సరం ఎన్నో ఆశలు, ఎన్నో ఆశయాలు, మరెన్నో ఆకాంక్షలు, లక్ష్యాలతో సంగమమై మన ముందుకు తరలివస్తుందని పవన్ పేర్కొన్నారు. ఇటువంటి 2022 నవ వసంతానికి ఆహ్వానం పలుకుతూ తెలుగువారందరితో పాటు భారతీయులందరికీ జనసేన తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలుపుతున్నట్లు పవన్ ట్వీట్ చేశారు.
గత రెండేళ్లలో కరోనా మహమ్మారి మానవాళిపై పైచేయి సాధించాలని చేసిన ప్రయత్నాలను మనమందరం చవిచూశామని, అయితే మానవాళి మనో నిబ్బరం, మనోవిజ్ఞానం ముందు కరోనా పలాయనం దిశగా ప్రయాణించడం లోక కళ్యాణంగా భావిస్తున్నట్లు పవన్ తెలిపారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లు కరోనా వెళ్లిపోయే ముందు కూడా తన ప్రభావాన్ని చాటాలని ప్రయత్నిస్తూనే ఉందన్నారు. ఇప్పటివరకు ప్రజలు ఎలాంటి జాగూరూకత చూపించారో.. ఇకపైనా అలాగే ముందుకు సాగాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు పవన్ ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆరోగ్యవంతమైన, ఆనందమైన జీవితం గడపాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. కరోనాతో పాటు అతివృష్టి రూపంలో కూడా ప్రకృతి కొంత కోపాన్ని ప్రదర్శించినా ప్రజల జీవన ప్రస్థానం అప్రతిహతంగా సాగిపోవడం సంతోషకరమైన పరిణామమన్నారు.
