NTV Telugu Site icon

Andhra Pradesh: విశాఖలో ఇన్ఫోసిస్ భారీ క్యాంపస్

Vishaka Infosys

Vishaka Infosys

ఏపీలో టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ భారీ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. టైర్-2 నగరాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేయాలని ఇన్ఫోసిస్ నిర్ణయించింది. ఈ మేరకు విశాఖలో విడతల వారీగా మూడు వేల సీటింగ్ కెపాసిటీ గల క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు ఇన్ఫోసిస్ ప్రతినిధులు వెల్లడించారు. ఇటీవల ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌తో ఇన్ఫోసిస్ ప్రతినిధులు సమావేశమై క్యాంపస్ ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాలపై చర్చించారు.

విశాఖలో ఇన్ఫోసిస్ క్యాంపస్ ఏర్పాటు చేయడంపై మంత్రి గుడివాడ అమర్నాథ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇన్ఫోసిస్ క్యాంపస్ ఏర్పాటుకు కావాల్సిన మద్దతు అందిస్తామని ఆయన ట్వీట్ చేశారు. ఇన్ఫోసిస్ ఏర్పాటుతో విశాఖ నగరానికి మరింత అందం చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తొలిద‌శ‌లో వెయ్యి సీటింగ్ కెపాసిటీతో ఈ క్యాంప‌స్‌ను ఇన్ఫోసిస్ సంస్థ ప్రారంభించ‌నుంది. ఈ క్యాంపస్ ఏకంగా ల‌క్ష చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇన్ఫోసిస్‌ ద‌శ‌ల‌వారీగా ఈ క్యాంపస్ కెపాసిటీని 3 వేల సీటింగ్‌కు పెంచ‌నుంది. త్వరలోనే ఉభయగోదావరి, విశాఖకు చెందిన ఇన్ఫోసిస్ ఉద్యోగులందరూ ఈ క్యాంపస్ నుంచే పనిచేస్తారని తెలుస్తోంది.