NTV Telugu Site icon

VV Lakshminarayana: ఎన్నికల్లో పోటీపై ఫైనల్‌గా ఓ నిర్ణయానికి వచ్చిన జేడీ లక్ష్మీనారాయణ..

Vv Lakshminarayana

Vv Lakshminarayana

వీఆర్ఎస్‌ తీసుకుని రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. గత ఎన్నికల్లో పోటీ చేసి విజయాన్ని అందికోలేకపోయారు.. అయితే, మరోసారి ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రం పక్కా అని చెబుతూనే ఉన్నారు.. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి అన్నట్లుగా.. తాను ఓటమి పాలైన లోక్‌సభ స్థానం నుంచే మళ్లీ పోటీ చేస్తానని చెబుతూనే వస్తున్నారు వీవీ లక్ష్మీనారాయణ.. గత ఎన్నికల్లో ఆయన జనసేన పార్టీ నుంచి బరిలోకి దిగారు.. ఆ తర్వాత రాజీనామా చేయడంతో.. ఈ సారి ఏ పార్టీలో చేరతారు? ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతారనే ప్రశ్నలు కూడా ఉత్పన్నం అయ్యాయి.. అయితే, దీనిపై కూడా తేల్చేశారు లక్ష్మీనారాయణ.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖ నుంచి లోక్ సభ సభ్యునిగా పోటీ చేస్తానని.. అదికూడా ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగనున్నట్టు స్పష్టం చేశారు.. జేడీ ఫౌండేషన్ సభ్యులు మరియు అతని శ్రేయోభిలాషుల సమావేశంలో లక్ష్మీనారాయణ ఈ నిర్ణయం తీసుకున్నట్లు జేడీ ఫౌండేషన్ కోఆర్డినేటర్ జగన్ మురారి తెలిపారు.

Read Also: YSR Ghat: ఇడుపులపాయలో వైఎస్‌ జగన్‌ పర్యటన.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించిన సీఎం

లక్ష్మీనారాయణను పలు పార్టీలు ఆహ్వానించినప్పటికీ సైద్ధాంతిక విభేదాల కారణంగా తమతో చేరకూడదని నిర్ణయించుకున్నట్లు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో మురారి తెలిపారు. విభజన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా మరియు ఆర్థిక లోటుతో ఉన్న రాష్ట్రంగా మిగిలిపోయింది. ఏపీకి ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీలపై కేంద్రం వెనక్కి తగ్గిందని పేర్కొన్నారు.. పలు పార్టీలు తనకు ఆహ్వానం పలికాయి.. కానీ, సిద్ధాంతాలు కలవకపోవడం వల్ల ఏ పార్టీలోనూ చేరకూడదని నిర్ణయించుకున్నారని ప్రకటించారు లక్ష్మీనారాయణ.. అందుకే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతానన్నారు.. అది కూడా విశాఖ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.. విశాఖ ప్రజలు తనకు ఎంతో ప్రేమ, ఆప్యాయత, గౌరవం ఇచ్చారు.. అందుకే మళ్లీ విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు చెప్పుకొచ్చారు.. అయితే, తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేసినప్పటికీ తన భావజాలానికి అనుకూలంగా ఉండే రాజకీయ పార్టీకి మాత్రం మద్దతు ఇస్తానన్నారు.. ఇక, త్వరలో తన మేనిఫెస్టోను విడుదల చేస్తానని పేర్కొన్నారు..

కాగా, గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరుపున విశాఖ లోక్‌సభ స్థానానికి పోటీ చేసిన లక్ష్మీనారాయణ ఓడిపోయారు. ఆ తరువాత కొన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉంటూ.. జనసేనకు రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో లక్ష్మీనారాయణకు 2,88,874 ఓట్లు వస్తే.. టీడీపీ నుంచి పోటీ చేసిన బాలయ్య చిన్న అల్లుడు భరత్‌కు 4,32,492 ఓట్లు వచ్చాయి.. ఇక, ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలోకి దిగిన ఎంవీవీ సత్యనారాయణ విజయం సాధించారు.. ఆయనకు 4,36,906 ఓట్లు వచ్చిన విషయం విదితమే.. వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీచేస్తానని ప్రకటిస్తూనే.. తన భావజాలానికి అనుకూలంగా ఉండే పార్టీలకు మద్దతు ఇస్తానని లక్ష్మీనారాయణ చెప్పడం వెనుక.. ఇంకా ఏదైనా వ్యూహం ఉందా? ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి.. ఇండిపెండెంట్‌గా కాకుండా.. ఏదైనా పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం ఉందా? అనే విషయాలకు కాలమే సమాధానం చెప్పనుంంది.

Show comments