NTV Telugu Site icon

Gandharva mahal: వందేళ్ల ‘‘గంధర్వ మహాల్’’.. ఆచంటలో అద్భుత కట్టడం..

Gandharva Mahal

Gandharva Mahal

Gandharva mahal: బర్మా టేకు, విదేశాల నుంచి విద్యుత్ దీపాలు, బెల్జియం అద్దాలు ఇలా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన గంధర్వ మహాల్ వందేళ్లు పూర్తి చేసుకుంది. మైసూర్ ప్యాలెస్‌ మరించేలా 1924లో నిర్మించిన ఈ అద్భుత కట్టడం పశ్చిమ గోదావరి జిల్లాకే ప్రత్యేకంగా నిలుస్తోంది. ఆచంటలో నిర్మించిన ఈ కట్టడం ఇప్పటికీ చూపరులను ఆకట్టుకుంటోంది. అప్పటి ఆచంట జమీందార్ గొడవర్తి నాగేశ్వర్ రావు 1918లో ఈ మహల్ నిర్మాణాన్ని మొదలుపెట్టారు. ఆ కాలంలోనే రూ. 10 లక్షలు ఖర్చు చేసి నిర్మించిన ఈ ప్యాలెస్ 1924లో నిర్మాణాన్ని పూర్తిచేసుకుంది. విద్యుత్ సౌకర్యం లేని ఆ రోజుల్లోనే విదేశాల నుంచి తెప్పించిన రంగురంగుల విద్యుత్ దీపాలను జనరేటర్ సాయంతో జిగేల్ అనేలా వెలిగించారని అప్పటి వరకు చెబుతున్నారు.

వందేళ్లు పూర్తి చేసుకున్న ఈ మహల్ వైభవం ఇప్పటికీ తగ్గలేదు. ఇప్పటికీ కూడా చెక్కుచెదరకుండా ఉంది. మాజీ ముఖ్యమంత్రులు మర్రిచెన్నారెడ్డి, ఎన్టీఆర్ పాటు చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రులకు ఈ భవనం ఆతిథ్యం ఇచ్చింది. ఎత్తైన భవనం నాలుగు వైపుల కోట మారిది బురుజులు, బర్మా టేకుతో చేసిన సింహద్వారాలు ఇప్పటీకీ రాచఠీవిని గుర్తు చేస్తున్నాయి.

Read Also: Heavy rain Alert: తెలంగాణకు అత్యంత భారీ వర్షసూచన.. రెడ్ అలర్ట్ జారీ

ఎంతో ఇష్టంతో కట్టించారు..

ఆచంట జమీందార్ గొడవర్తి నాగేశ్వర్ రావు తన చిన్న తనం నుంచి కోటలు చూస్తూ పెరగడంతో, తన ఊరిలో కూడామ ఇలాంటి కోట ఒకటి నిర్మించాలనే ఉద్దేశ్యంతోనే గంధర్వ మహల్‌కి రూపకల్పన చేశారు. 1916లో రాజస్థాన్ వెళ్లి అక్కడ కోట నిర్మాణాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. దాని తర్వాత ఆచంటలో అర ఎకరం స్థలంలో 1918లో మహల్ నిర్మాణాన్ని ప్రారంభించారు. మహల్ కోసం బర్మా నుంచి టేకు, బెల్జియం నుంచి అద్దాలు, లండన్ నుంచి ఇనుప గడ్డర్లను తెప్పించారు. సున్నపురాయి, కోడిగుడ్డు సొనతో చేసిన సిమెంట్‌ని భవన నిర్మాణం కోసం ఉపయోగించారు. ఈ మహల్ మైసూర్ మహారాజ ప్యాలెస్, గోల్కోండ కోటను చూసిన అనుభూతిని ఇస్తుంది.

ఈ భవనంలో మొత్తం నాలుగు అంతస్తులు, 12 బెడ్రూంలు ఉన్నాయి. ఈ గంధర్వ మహల్‌కి 1969లో, చివరిసారిగా 2008లో రంగులు వేశారు. ప్రస్తుతం వందేళ్ల పండగ కోసం మరోసారి రంగులు వేయించారు. ఈ గంధర్వ మహల్ లో గోడవర్తి నాగేశ్వరరావు అనంతరం మూడు తరాల వారసులు గంధర్వ మహల్ లో నివసిస్తున్నారు, నాలుగో తరం వారిలో కొందరు విదేశాల్లో స్థిరపడ్డారాని గోడవర్తి శ్రీరాములు తెలిపారు. శుక్రవారం నాగేశ్వర్రావు మూడో తరం వారసులు వందేళ్లు పూర్తైన సందర్భంగా వేడుకలు నిర్వహించనున్నారు.