ఎండాకాలం వచ్చేసింది. భానుడు ప్రచండంగా మారిపోతున్నాడు. సూరీడు దెబ్బకు జనం విలవిలలాడిపోతున్నారు. వడదెబ్బ తగలకుండా ఉండాలంటే తీవ్ర ఉష్ణోగ్రతలు ఉండే సమయంలో ఎక్కువగా ఎండలో తిరగవద్దు. రోడ్ల వెంట విక్రయించే చల్లని రంగు పానీయాలు, కలుషిత ఆహారానికి దూరంగా ఉండాలి. మద్యం, మాంసం తగ్గించాలి. నీరు, పళ్ల రసాలు, కొబ్బరినీళ్లు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి. కోవిడ్ టైంలో ఎలాగైతే జాగ్రత్తలు పాటించామో ఇప్పుడు కూడా అదేవిధంగా జాగ్రత్తగా వుండాలి.
ఒకవేళ ఎవరికైనా వడదెబ్బ తగిలితే వెంటనే త్వరగా చల్లని గాలి తగిలే ప్రదేశానికి చేర్చాలి. ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజు ద్రావణం లేదా ఓఆర్‌ఎస్ తాగించాలి. పిల్లలు, గర్భిణులు, వృద్ధులు ఎండాకాలం మరింత జాగ్రత్తగా వుండాలి. వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లిన వ్యక్తికి బీపీ హెచ్చుతగ్గుల వల్ల కార్డియాక్ అరెస్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వెంటనే ఆసుపత్రికి తరలించాలి.
వడదెబ్బ లక్షణాలు ఎలా వుంటాయో ముందుగా తెలుసుకోవాలి. సాధారణంగా వడదెబ్బకు గురైనప్పుడు సాధారణంగా 102డిగ్రీల ఫారెన్ హీట్ కంటే తక్కువ జ్వరం వస్తుంది. దీంతో పాటు వాపు, మూర్ఛ వచ్చే ప్రమాదముంది. అలసట, బలహీనత, వికారం, తలనొప్పి, వాంతులు, కండరాల్లో తిమ్మిరి సహా ఒళ్లంతా చెమటలు పడుతుంటాయి.
ఏం చేయాలంటే..?
- బాగా చల్లని పానీయాలు కాకుండా తరచుగా నీళ్లు తాగాలి
- తేలికైన లేత-రంగుల్లో వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి
- బయటకు వెళ్లేటప్పుడు ఎండ నుంచి రక్షణ పొందేందుకు కూలింగ్ గ్లాసెస్, గొడుగు/టోపీ పెట్టుకోవాలి
- బయట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఎండలోకి వెళ్ళడం మానుకోవాలి
- మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య ఆరుబయట పని చేయకుండా వుండాలి
*శరీరాన్ని డీహైడ్రేట్‌కు గురిచేసే ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బొనేటెడ్ కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి - ఓఆర్‌ఎస్, లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, పుదీనా వాటర్ వంటి ఇంట్లో తయారుచేసిన పానీయాలు తాగాలి
- సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం తగ్గుతుంది.
- వీలైనంతగా ఇంట్లో చల్లదనం కోసం అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి. అందుకోసం కర్టెన్స్, సన్‌షేడ్స్ ఉపయోగించాలి.
- కిటికీల ద్వారా వేడి రాకుండా అక్కడ తడిసిన బట్టలు వేస్తుండాలి. ఎయిర్ కూలర్స్ ఉపయోగించాలి.