నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఓ రోడ్డుప్రమాదంలో రామకృష్ణ అనే లెక్చరర్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని 108 వాహనం ద్వారా బంధువులు ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. అయితే బాధితుడు రామకృష్ణకు సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు చికిత్స చేశారు. బాధితుడి తలకు కట్టు కట్టి సెలైన్లు పెట్టారు. డ్యూటీ డాక్టర్ అందుబాటులో ఉన్నప్పటికీ కేవలం ఇంజక్షన్ చేసి ఊరుకున్నాడు.
దీంతో రామకృష్ణ పరిస్థితి విషమించడంతో ఆందోళన చెందిన బంధువులు వెంటనే నెల్లూరులోని ఓ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. అయితే నెల్లూరులోని సూపర్ స్పెషలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రామకృష్ణ మృతి చెందాడు. అయితే తమ కళ్లముందే రామకృష్ణ చనిపోవడంతో అతడి కుటుంబం ఇప్పుడు గుండెలు బాదుకుంటోంది. అంతులేని నిర్లక్ష్యం రామకృష్ణను పొట్టన బెట్టుకుందని కన్నీరుమున్నీరవుతోంది. కాగా ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్ ఉన్నా సరిగా స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.