ఉద్యోగం పేరు చెబితే ఎన్ని లక్షలైనా ఖర్చుచేయడానికి వెనుకాడని రోజులివి. ఉద్యోగాల పేరుతో జరిగే మోసాలను సినిమాల్లో సైతం కామెడీగా చూపించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం జిల్లా పోలీసు కార్యాలయంలో హోమ్ గార్డు ఘరానా మోసం బయటపడింది. కరోనా కారణంగా నలుగురు హోంగార్డులు చనిపోయారు వారి పోస్టులు ఖాళీ ఉన్నాయని వాటిని మీకే వచ్చేలా చూస్తానంటూ అమాయక ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి ..ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికి లక్షల వసూలు చేశాడో హోం గార్డు.
కొంత మందికి హోంగార్డు బెల్టు, యూనిఫాం కూడా ఇచ్చి డబ్బులు తీసుకున్నాడు. తాము మోసపోయామని తెలుసుకుని చిలకలపూడి పోలీసులను ఆశ్రయించారు నిరుద్యోగులు. నిందితుడిని హోంగార్డ్ షబ్బీర్ అహ్మద్ గా గుర్తించిన అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని 420 కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు చిలకలపూడి పోలీసులు.
స్వలాభం కోసం విధులను అడ్డం పెట్టుకున్న హోంగార్డుపై చర్యలకు ఉపక్రమించారు జిల్లా ఎస్పీ. ఉద్యోగాల పేరుతో పలువురు అమాయక నిరుద్యోగుల నుండి డబ్బు వసూలు చేసి మోసం చేస్తున్న హోంగార్డుపై శాఖాపరమైన, క్రిమినల్ చర్యలు తీసుకోనున్నారు. పోలీస్ శాఖలో అవినీతి కార్యకలాపాలకు, అక్రమ వ్యాపారాలకు పాల్పడితే సహించేది లేదంటున్నారు జిల్లా ఎస్పీ. ఈ తరహా సంఘటనలు ప్రజల దృష్టికి వస్తే వెంటనే తెలియజేయాలని ఆయన కోరుతున్నారు.
శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల ధన మాన ప్రాణ సంరక్షణలో ప్రధాన భూమిక పోషించేది పోలీస్ శాఖ. ప్రజలకు అనునిత్యం రక్షణ కల్పిస్తూ ప్రజల కష్టం వస్తే పోలీస్ శాఖ అండగా ఉంటుందనే ధైర్యాన్ని ప్రజల్లో నింపుతున్నారు. అలాంటి బాధ్యతాయుతమైన పోలీస్ శాఖలో విధులు నిర్వర్తిస్తూ అమాయక ప్రజల యొక్క అవసరాలను అలుసుగా తీసుకొని, డబ్బులు వసూలు చేస్తున్న హోంగార్డు పై క్రమశిక్షణా, క్రిమినల్ చర్యలకు ఉపక్రమిన్నట్లు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ తెలిపారు.
మచిలీపట్నంలో పోలీసు విభాగంలోని పోలీస్ శిక్షణ కేంద్రం నందు హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డ్- 259 షబ్బీర్ అహ్మద్ అనే వ్యక్తి నిరుద్యోగ యువకుల యొక్క అవసరాలను ఎరగా పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికాడు. వారి వద్ద నుండి లక్షల మొత్తంలో నగదు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఎస్పీ దృష్టికి వచ్చాయి. ఈ ఆరోపణలపై మహమ్మద్ మొబిన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా, బాధితుల వద్ద నుండి ఫిర్యాదులు రావడంతో అతని పూర్తి సమాచారం తెలియజేయమని ఎస్పీ పోలీస్ అధికారులను ఆదేశించారు.
అతను చేస్తున్న మోసాల గురించి పూర్తి నివేదిక తయారు చేసి ఎస్పీకి సమర్పించగా ఆరోపణలు నిజమని నిర్ధారణ చేసుకొని అతని పై క్రమశిక్షణా, క్రిమినల్ చర్యలకు, ఉపక్రమిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. అతనిపై చిలకలపూడి పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ నెంబర్ 125/2022 నందు కేసు నమోదు చేసి, హోంగార్డుని అదుపులోనికి తీసుకొవడం జరుగిందని జిల్లా ఎస్పీ తెలిపారు.
పోలీస్ శాఖలో ఎవరైనా ఇలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న, అది నిజమని నిర్ధారణ అయితే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. అంతేకాక లంచం పుచ్చుకోవడంతో పాటు ఇవ్వడం కూడా నేరమేనని ఎవరైనా ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తే వారిపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇలాంటి అవినీతి కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం మీ దృష్టికి వస్తే వెంటనే కృష్ణాజిల్లా వాట్సాప్ నెంబర్ – 9182990135, DIAL-100 కి గాని హెల్ప్ లైన్ నెంబర్లకి గాని తెలియజేయ వచ్చునని, ఇంకా బాధితులు ఎవరైనా ఉంటే పోలీసులను సంప్రదించాలని ప్రజలను కోరారు.
