NTV Telugu Site icon

కడప జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలు

అల్ప పీడన ప్రభావంతో కడప జిల్లాలో భారీగా కురుస్తున్నవర్షాలకు జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. ఈ ఉద‌యం నుంచి వ‌ర్షాలు కురుస్తుండ‌టంతో జ‌నం బిక్కుబిక్కుమంటున్నారు. వ‌ర్షం ధాటికి క‌డ‌ప న‌గ‌రంలోని అనేక ప్రాంతాలు మ‌ళ్ళీ జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. క‌డ‌ప కార్పొరేష‌న్ ప‌రిధిలోని ఎన్జీవో కాల‌నీ, బాలాజీ న‌గ‌ర్‌, ఆర్టీసీ బ‌స్టాండ్‌, అప్సరా స‌ర్కిల్‌, శంకరాపురం, కోఆప్ రేటివ్ కాల‌నీ ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. వర్ష ప్రభావం రెండు రోజులు ఉంటుంద‌న్న వాతావ‌ర‌ణ శాఖ సూచ‌న‌ల‌తో ముంద‌స్తుగా జిల్లావిద్యాశాఖ సోమ‌వారం అన్ని పాఠ‌శాల‌ల‌కు సెల‌వు ప్రకటించింది.

లోత‌ట్టు ప్రాంతాల వారిని అధికారులు అప్రమత్తం చేశారు. న‌దులు, వాగులు, వంక‌లు పొంగి పొర్లే అవ‌కాశం ఉన్న చోట్ల ర‌హ‌దారుల‌పై రాక‌పోక‌ల‌ను కట్టడి చేస్తున్నారు. న‌దులు, ప్రమాదకర ర‌హ‌దారులు ఉన్న చోట్ల పోలీసు బందోబ‌స్తు ఏర్పాటు చేసి అటువైపుగా ఎవ‌రూ వెళ్లకుండా చూస్తున్నారు. భారీ వ‌ర్షాలు కురిస్తే మొన్నటి వాన‌లకు, వ‌ర‌ద‌ల‌కు త‌డిచిపోయిన పాత‌కాలం నాటి భ‌వ‌నాలు దెబ్బతింటాయనే ఆందోళన వ్యక్తం అవుతుంది. మరోవైపు మొన్నటి వర్షాలకు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కడప ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈసారి భారీ వర్షాలు పడితే నష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉందని, అలా జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.