ఏపీబీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నాయకత్వంలో “సంక్రాంతి సంబరాలు” ముగింపు కార్యక్రమలకు గుడివాడ వెళ్తున్న బీజేపీ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడారు. పోలీసులు ఏ నిబంధనలతో బీజేపీ నాయకులను అడ్డుకుంటున్నారో చెప్పాలన్నారు. అక్రమంగా అరెస్ట్ చేసి బస్సుల్లో తరలించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడి పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించడమేంటని ఆయన మండిపడ్డారు. అధికార దాహానికి, అధికార మదానికి హద్దు ఉంటుందని వైసీపీకి చురకలంటించారు. అరెస్ట్ చేసిన వారిని ఇప్పటికీ మూడు, నాలుగు పోలీస్ స్టేషన్లు మార్చారన్నారు. అరాచకాలు సృష్టిస్తున్న వారిని వైసీపీ ప్రభుత్వం ఏమి చేయలేక బీజేపీ నేతలను అరెస్టులు చేసి కేసులు పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు బీజేపీ నేతలను అరెస్ట్ చేశారో సీఎం జగన్ సమాధానం చెప్పి తీరాలన్నారు. వైసీపీ వారికి ముగ్గుల పోటీలు పెట్టకూడదు.. కానీ మూడు ముక్కలాటలను మాత్రం ప్రోత్సహిస్తారంటూ ఎద్దేవా చేశారు.బీజేపీ నేతల అక్రమ అరెస్టులకు సీఎం జగన్ బాధ్యత వహించాలన్నారు. పోలీస్ అధికారులు నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని జీవీఎల్ హెచ్చరించారు.
అధికార పక్షం చెప్పినట్లు పోలీస్ అధికారులు వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. బీజేపీతో చెలగాటం ఆడొద్దు.. ఇది టీడీపీ కాదు.. తప్పుడు కేసులు పెడితే బీజేపీ చూస్తు ఊరుకోదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డగోలుగా వ్యవహరిస్తే వైసీపీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ విమర్శించారు. పీఆర్సీ అంటే “పే రివిజన్” కమిషన్ అనుకున్నారా…పే రెడ్యూస్డ్ కమిషన్ అనుకున్నారా.. అంటూ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పీఆర్సీ పెంచేదే లే అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పీఆర్సీ విషయంలో ఉద్యోగుల గుండె రగులుతుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి రోజు ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ పడుకుంటున్నారని జీవీఎల్ అన్నారు. ప్రజల దృష్టి మార్చే పనులు చేస్తే అది వైసీపీ ప్రభుత్వానికే నష్టం కలిగిస్తుందని జీవీఎల్ వ్యాఖ్యానించారు. పీఆర్సీ, బీజేపీ నేతల అరెస్టులపై జగన్ సమాధానం చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.
