ఏపీ సీఎం జగన్ తన మాటకు కట్టుబడి కొత్త జిల్లాలను ఏర్పాటుచేశారు. రేపటినుంచి కొత్తజిల్లాల్లో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నాం అన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. అయితే వసతులు,సదుపాయాలు లేకుండా కొత్త జిల్లాల్ని ఏర్పాటుచేస్తే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. అమరావతి తరహాలో కొత్త జిల్లాలను చేయవద్దన్నారు. అమరావతి అభివృద్ధికి నిధులివ్వాలని కేంద్రాన్ని ఎందుకు అడగడంలేదన్నారు జీవీఎల్.
2019 ఎన్నికల్లో 26 జిల్లాల ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించాం. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు అసంబద్ధంగా జరిగింది. వసతులు,సదుపాయాలు లేకుండా కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. నిధులు లేకుండా కొత్త జిల్లాల్లో విధులు నిర్వహించడం సాధ్యం అవుతుందా..? విభజన జరిగిన తరువాత రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు కొత్త జిల్లాల ప్రకటన అలాగే ఉందన్నారు.
అమరావతి లాగా కొత్త జిల్లాలను చెయ్యొద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు. ఒక్కో జిల్లాకు కనీసం రూ.100 కోట్ల నిధులను ఎందుకు కేటాయింపులు చెయ్యలేదు…? ప్రభుత్వం కొత్త జిల్లాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే జిల్లాల పరిస్థితి నిర్వీర్యం అవుతుంది. కొత్త జిల్లా ఏర్పాటులో జిల్లా కేంద్రం, మండల కేంద్రాలకు అస్సలు పొంతన లేదు. మౌళిక వసతులు ఏర్పాట్లు చేయకుండా కొత్త జిల్లాలను ఎలా ఏర్పాటు చేస్తారు..?
జిల్లా కేంద్రాలకు, మండల కేంద్రాలకు కనెక్టివిటీ పెంచాలి. అమరావతిపై హైకోర్టు ఆదేశాలు ధిక్కరించేలా ప్రభుత్వం వ్యవహరించడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. అమరావతికి నిధులు ఇవ్వకుండా రైతులకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు అమరావతిలో గత ప్రభుత్వం భూములు కేటాయిస్తే కనీసం మౌలిక వసతుల కోసం ఇప్పటి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. రాజధాని విషయంలో స్పష్టత ఇవ్వకపోవడంతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అమరావతిలో వెనకడుగు వేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు అమరావతిలో నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అ సంస్థలకు లేఖలు రాయాలి. అమరావతి నిర్మాణం కోసం నిధులివ్వాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ ఎందుకు రాయడం లేదు..? అమరావతికి కేంద్ర ప్రభుత్వం సహాకరించడానికి సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదని జీవీఎల్ ప్రశ్నించారు.
