Site icon NTV Telugu

Guntur SP: వైఎస్ జగన్ ఇంటి సమీపంలో అగ్నిప్రమాదంపై గుంటూరు ఎస్పీ రియాక్షన్ ఇదే..!

Guntur Sp

Guntur Sp

Guntur SP: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇంటి సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదంపై ఫిర్యాదు చేసిన వారిపై కేసులు పెడుతున్నారు అనే వాదనను గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తోసిపుచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా వచ్చారా అనే విషయంలో నోటీసులు ఇచ్చామే కానీ.. కేసులు పెట్టిన వారికి నోటీసులు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. బయట సీసీ కెమెరా విజువల్స్ లో ఆధారాలు దొరకకపోవడంతో.. పార్టీ కార్యాలయంలోని సీసీ కెమెరాల విజువల్స్ అడిగాం.. ఆరోజు ఎవరెవరు సమావేశానికి వచ్చారు!.. ఎవరు అనుమానాస్పదంగా ఉన్నారు? అనే విషయాలను పార్టీ కార్యాలయంలోని సీసీ కెమెరాల సాయంతో తెలుసుకోవచ్చని అధికారులు భావించారన్నారు. అందుకే, విజువల్స్ కావాలని నోటీసులు ఇచ్చామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ స్పష్టం చేశారు.

Read Also: CM Chandrababu: ఫైళ్ల క్లియరెన్స్ స్పీడ్ గా జరగాలి..

అయితే, తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయ అగ్ని ప్రమాద ఘటనలో పోలీసుల నోటీసులకు కార్యాలయ ప్రతినిధులు సమాధానం ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ భద్రతపై పలు అనుమానాలున్నాయి. జగన్ భద్రత విషయంలో ఇప్పటికే పోలీసులు, కోర్టు దృష్టికి తీసుకెళ్లాం.. అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులకు మేమే ఫిర్యాదు చేశామన్నారు. ప్రభుత్వం మారాక జగన్ నివాసం వద్ద బారికేడ్లను, సీసీ కెమెరాలను గతంలోనే తొలగించారు. ఇప్పుడు మేం ఫిర్యాదు చేస్తే పోలీసులు మాకే నోటీసులు ఇచ్చారు.. ఘటన జరిగిన రోజు కార్యాలయానికి వచ్చిన పార్టీ నేతల సమాచారం పోలీసులకు ఇచ్చామని వైసీపీ ప్రధాన కార్యాలయం ప్రతినిధులు పేర్కొన్నారు.

Exit mobile version