TDP : గుంటూరు మేయర్ పీఠంపై టీడీపీ ఫోకస్.. బరిలోకి లక్ష్మీ అపర్ణ..

  • మేయర్ అభ్యర్థిగా లక్ష్మీ అపర్ణ నామినేషన్
  • నామినేషన్ కార్యక్రమంలో కూటమి నేతల సందడి
  • గుంటూరు అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు: పెమ్మసాని
  • కూటమి నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తా: లక్ష్మీ అపర్ణ
Tdp

Tdp

గుంటూరు కార్పొరేషన్ మేయర్ స్థానానికి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అభ్యర్థిగా కోవెలమూడి లక్ష్మీ అపర్ణ శుక్రవారం తన నామినేషన్‌ను లాంఛనంగా దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు, గళ్లా మాధవితో పాటు కూటమి పార్టీలకు చెందిన పలువురు ప్రముఖ నేతలు భారీ సంఖ్యలో పాల్గొని అభ్యర్థికి సంఘీభావం తెలిపారు. నామినేషన్ పత్రాల దాఖలు సందర్భంగా గుంటూరులో కూటమి శ్రేణుల సందడి నెలకొంది.

అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాం:   పెమ్మసాని చంద్రశేఖర్

ఈ సందర్భంగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తెలుగు ప్రజల సమగ్రాభివృద్ధికి ఎంతో నిబద్ధతతో పాటుపడుతోందని స్పష్టం చేశారు. యుద్ధప్రాతిపదికన నగరంలో పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేయడానికి అన్ని ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. గత పదిహేనేళ్లుగా పార్టీ కోసం కోవెలమూడి కుటుంబం చేసిన నిస్వార్థ సేవలను గుర్తించే అధిష్టానం లక్ష్మీ అపర్ణకు మేయర్ అభ్యర్థిగా అవకాశం కల్పించిందని చెప్పారు. కూటమి నాయకుల సమష్టి కృషితో గుంటూరు మేయర్ స్థానాన్ని టీడీపీ అత్యధిక మెజారిటీతో కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

కూటమి విజయమే లక్ష్యంగా పనిచేస్తాం:   లక్ష్మీ అపర్ణ

తన నామినేషన్‌ను ఖరారు చేస్తూ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం పట్ల అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ కృతజ్ఞతలు తెలిపారు. తన అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతునిచ్చి సహకరించిన కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, కూటమి నేతలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీ తనకు మేయర్ స్థానాన్ని కేటాయించడం చాలా సంతోషంగా ఉందని, ప్రజలకు సేవ చేయడానికి తన కుటుంబం ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. మహిళలకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను ఈ సందర్భంగా నిలబెట్టుకున్నారని కొనియాడారు. కూటమి నాయకత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి కట్టుబడి, గుంటూరు నగర సమగ్ర అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తామని లక్ష్మీ అపర్ణ పేర్కొన్నారు.