Site icon NTV Telugu

Venkaiah Naidu: చట్ట సభల్లో హ్యూమర్ ఉండాలి.. గ్రామర్ ఉండాలి

Venkaiah Naidu

Venkaiah Naidu

Venkaiah Naidu:  విజయవాడలో మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో ఆయన స్నేహితులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ స‌మావేశానికి ఏపీలోని మూడు ప్రధాన పార్టీల‌కు చెందిన కీల‌క నేత‌లు హాజ‌రయ్యారు. టీడీపీకి చెందిన విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని, వైసీపీకి చెందిన యువ నేత దేవినేని అవినాష్, బీజేపీకి చెందిన మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు ప్రసంగిస్తూ.. ఈ కార్యక్రమం ద్వారా పలువురు మిత్రులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, నిష్ణాతులను కలవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

అటు చట్ట సభల్లో విమర్శల కంటే తిట్ల దండకం ఎక్కువైపోయిందని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. పుస్తకాలు.. కాగితాలు చించితే చొక్కాలను చించుకున్నట్టేనని ఆయన తెలిపారు. తానూ అసెంబ్లీలో ఉన్నానని.. ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టేవాడిని అని.. కానీ ఏ రోజూ పోడియం వద్దకు వెళ్లలేదని వివరించారు. చట్టసభల్లో మాట్లాడేటప్పుడు కొంత హాస్యం ఉండాలి.. సబ్జెక్టు ఉండాలని సూచించారు. హ్యూమర్ ఉండాలి.. గ్రామర్ కూడా ఉండాలన్నారు. విమర్శలు చేయవచ్చు.. ఉతికి ఆరేయవచ్చు.. ఎండ గట్టొచ్చు.. కానీ దూషణలకు దిగకూడదని వెంకయ్య నాయుడు హితవు పలికారు. రాజకీయ పార్టీలు తమ సభ్యులకు స్వచ్ఛంద ప్రవర్తనా నియామవళి రూపొందించాలని సూచించారు. చట్ట సభల హుందా పెరగాలంటే.. రాజకీయ పార్టీలు బాధ్యత తీసుకోవాలన్నారు.

Read Also: Muralidhar Rao: ఖాసిం రజ్వీ వారసుడు అసదుద్దీన్ ఒవైసీ

రాజ్యసభలో మాట్లాడేందుకు సభ్యులకు తాను ఇచ్చిననన్ని అవకాశాలు మరెవ్వరూ ఇవ్వలేదని.. ఇది రికార్డు అని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. సభ నుంచి తమ సభ్యులు సస్పెండ్ కావాలని పార్టీ అధినాయకులు కూడా కోరుకుంటున్నారని.. అప్పుడే కవరేజ్ వస్తోందని భావిస్తున్నారని తెలిపారు. భారతీయ సంస్కృతిని పెంపొందించుకోవాలని.. దాని కోసం మళ్లీ మూలాల్లోకి వెళ్లాలని సూచించారు. ఉప రాష్ట్రపతి పదవి నుంచి దిగిపోయాక తనకు స్వతంత్రం వచ్చినట్లు ఉందన్నారు. ఉప రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఎవర్నైనా కలవడానికి కొన్ని ఇబ్బందులు వచ్చేవి అని.. ఇప్పుడు ఎవర్నైనా.. ఎప్పుడైనా కలిసే అవకాశం ఉందన్నారు. అందర్ని కలవడం.. చక్కగా తినడం తనకు చాలా ఇష్టమన్నారు. పునుగులు.. మసాల వడలు తినడం అంటే ఇష్టంగా ఉంటుందన్నారు. మన వంటకాలను వదిలి పేస్ట్రీలు.. మేస్త్రీలు వెనుక పడడం దేనికి అంటూ ప్రశ్నించారు. విజయవాడలోని బాబాయ్ హోటల్లో ఇడ్లీ తినడం ఇష్టమన్నారు.

ఉప రాష్ట్రపతి కాక ముందు ఎక్కడ ఫుడ్ బాగుంటే అక్కడ ఆగి తినేసేవాడిని అని వెంకయ్యనాయుడు తెలిపారు. ఉప రాష్ట్రపతి అయ్యాక.. తాను తినాలంటే ముందుగా ఓ నలుగురు తినాలన్నారు. ఉప రాష్ట్రపతి హోదాలో ఎంత హుందాగా ఉన్నాం.. సభను ఎంత చక్కగా నిర్వహించామన్నదే తనకు ముఖ్యమని పేర్కొన్నారు.ఉప రాష్ట్రపతిగా కంటే.. ముప్పవరపు వెంకయ్య నాయుడుగానే తనను గుర్తు పెట్టుకోవాలన్నారు. మాతృ భాషపై పట్టు సాధించాలని.. ఫస్ట్ మదర్ టంగ్.. నెక్స్ట్ బ్రదర్ టంగ్.. ఆ తర్వాతే అదర్ టంగ్ అని ఛలోక్తులు విసిరారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పు కాదు.. కానీ ఇంగ్లీష్‌కే పరిమితం కాకూడదన్నారు. కుల, మతం, క్రిమినల్ రికార్డులున్న వాళ్లకే రాజకీయాలు అన్నట్టుగా పరిస్థితి మారిందని.. హక్కుల గురించే కాదు.. బాధ్యతలు గురించి ఆలోచన చేయాలన్నారు. రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్సే కాదు.. ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉన్నాయని పేర్కొన్నారు.

Exit mobile version