ఏపీ సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. జగనన్న అమ్మ ఒడి నిధులను విడుదల చేసేందుకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆయన శ్రీకాకుళం చేరుకున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురు వైసీపీ ముఖ్య నేతలు సీఎం జగన్‌కు ఘనస్వాగతం పలికారు. పలువురు మంత్రులు, వైసీపీ ప్రజాప్రతినిధులు హెలిప్యాడ్ వద్ద జగన్‌కు స్వాగతం పలికారు. అయితే సీఎం హెలిప్యాడ్ వద్దకు కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వెళ్లేందుకు ప్రయత్నించగా అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఆమె అధికారుల ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరాశగా వెనుతిరిగారు. ఆమెకు నచ్చజెప్పేందుకు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
కాగా శ్రీకాకుళం చేరుకున్న అనంతరం సీఎం జగన్ ఆర్ అండ్ బీ జంక్షన్ నుంచి పట్టణంలోని ప్రధాన కూడళ్ల మీదుగా సభాప్రాంగణం కోడిరామ్మూర్తి స్టేడియానికి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా నిలబడి సీఎం జగన్‌కు సిక్కోలు వాసులు అభివాదం తెలిపారు. అటు వరుసగా మూడో ఏడాది జగనన్న అమ్మ ఒడి పథకాన్ని శ్రీకాకుళంలో వర్చువల్‌గా సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు అమ్మ ఒడి పథకం నిధులను విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో సీఎం జగన్ జమ చేయనున్నారు. రాష్ట్రంలో 43.96 లక్షల మంది తల్లుల బ్యాంక్ ఖాతాలలో రూ.6,594 కోట్ల నిధులను సీఎం జగన్ విడుదల చేస్తారు.
