గుంటూరు జిల్లాలో నకిలీ కరెన్సీ నోట్లు కలకలం రేపుతున్నాయి. కొందరు వ్యక్తులు కరెన్సీ నోట్లను కలర్ జిరాక్సు తీసి చలామణి చేస్తున్నారు. దీంతో దొంగనోట్ల ముఠా గుట్టును పోలీసులు కనిపెట్టారు. ముఖ్యంగా మేడికొండూరు, నడికుడి ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి కలర్ జిరాక్స్ ద్వారా నకిలీ నోట్లు తయారుచేస్తున్నారు. ముఖ్యంగా రూ.500, రూ.200 నోట్లు ముద్రించి సుమారు రూ.2.2 లక్షల మేర తెలుగు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాల్లో ముఠా సభ్యులు చలామణీ చేసినట్టు పోలీసులు గుర్తించారు.
Read Also: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. రాత్రిపూట షిర్డీ ఆలయం మూసివేత
ఈ నేపథ్యంలో నకిలీ నోట్లను తయారుచేస్తున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి 45 లక్షల రూపాయల నకిలీ నోట్లను సీజ్ చేశారు. నకిలీ నోట్ల ముద్రణకు ఉపయోగించే ప్రింటర్లు, జిరాక్స్ మిషన్లు, స్కానర్లు, పేపర్లను సీజ్ చేశారు. ముఠా ఉపయోగిస్తున్న రెండు కార్లను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా సభ్యులు గుంటూరు జిల్లాలోని దుర్గి, అచ్చంపేట, రెంటచింతల, దాచేపల్లి ప్రాంతాలకు చెందినవారని జిల్లా అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ వెల్లడించారు.
