NTV Telugu Site icon

Vellampalli Srinivas: వైఎస్ఆర్ చనిపోయి 13 ఏళ్ళు అయినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు

Vellampalli Srinivas

Vellampalli Srinivas

Vellampalli Srinivas: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాలను వైసీపీ నేతలు నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్ 13వ వర్ధంతి సందర్భంగా కంట్రోల్ రూమ్ వద్ద ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్సీ రుహుల్లా, ఇతర నేతలు నివాళులర్పించారు. అనంతరం మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. వైఎస్ఆర్‌ను తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు అని వ్యాఖ్యానించారు. 2004 నుంచి 2009 వరకు నభూతో న భవిష్యత్ అనేలా వైఎస్ఆర్ పరిపాలన జరిగిందన్నారు. వైఎస్ఆర్ చనిపోయి 13 ఏళ్ళు అయినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని గుర్తుచేసుకున్నారు. వైఎస్ అమలు చేసిన పథకాల్లో ఒక్కటి కూడా చంద్రబాబు కొనసాగించలేకపోయారని ఆరోపించారు.

14 ఏళ్ళు సీఎంగా పని చేసిన చంద్రబాబు పాలన చూస్తే ఒక్క పథకం గుర్తుకు రాదని.. సీఎం జగన్ మళ్లీ వైఎస్సార్ పథకాలను అమలు చేస్తున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కొనియాడారు. రూ.2కే కిలో బియ్యం పేరు చెప్తే ఎన్టీఆర్, ఆరోగ్యశ్రీ అంటే వైఎస్సార్, అమ్మఒడి అంటే జగన్ గుర్తుకొస్తాయన్నారు. చంద్రబాబు అంటే కరువు కాటకాలు గుర్తుకొస్తాయని ఎద్దేవా చేశారు. తనదైన శైలిలో ఉమ్మడి రాష్ట్రంలో మహానేత వైఎస్ఆర్ అనేక కార్యక్రమాలు రూపొందించారని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం వంటి పథకాలు చరిత్రలోనే నిలిచిపోయాయన్నారు. పాలన అంటే వైఎస్సార్ ముందు వైఎస్సార్ వెనుక అనేలా ఉందన్నారు. సమాజంలో వెనుకబడిన కులాలను సీఎం జగన్ ముందుకు తెచ్చారన్నారు. వైఎస్ఆర్ ఆలోచనలు, సిద్ధాంతాలకు అనుగుణంగా జగన్ పాలన సాగిస్తున్నారని కొనియాడారు. ఐఐఐటీలు, బందరు పోర్టు వంటివి వైఎస్ఆర్ హయాంలో మన ప్రాంతానికి వచ్చాయన్నారు. రూపాయి డాక్టరుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి వైఎస్ఆర్ కోట్లమంది మనసులను గెలుచుకున్నారన్నారు.

వైఎస్ఆర్ ప్రజల గుండెచప్పుడు తెలుసుకున్న నేత అని మేయర్ రాయన భాగ్యలక్ష్మి వ్యాఖ్యానించారు. వైద్య వృత్తిలో ఉండడం వల్ల ప్రజలకు వైద్యం ఎంత అవసరమో తెలుసుకున్న నాయకుడు అన్నారు. వైఎస్ఆర్ హయాంలో జరిగిన సంక్షేమం, వైద్యం అప్పట్లో ఒక సంచలనం అని.. జగన్ తండ్రి కంటే పది అడుగులు ముందుకు వేసి పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు.