Andhra Pradesh: ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కారు అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. మెడికల్ రీఎంబర్స్‌మెంట్ పథకం గడువును పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2022 ఆగస్టు 1 నుంచి 2023 మార్చి 31 వరకు మెడికల్ రీఎంబర్స్‌మెంట్ పథకం గడువును పొడిగిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు కూడా మెడికల్ రీఎంబర్స్‌మెంట్ పథకాన్ని పొడిగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్)కు అనుబంధంగా ఈ పథకం అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి పలు ఉద్యోగ సంఘాల నేతలు చేసిన విజ్ఞప్తుల్ని పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు వెల్లడించారు.
Read Also: Andhra Pradesh: ఐఏఎస్‌లకూ ఫేస్ రికగ్నేషన్ యాప్ అటెండెన్స్
అటు ఉద్యోగులు, పెన్షనర్ల ఇహెచ్ఎస్ పథకాన్ని సులభతరం చేసేందుకు అనువైన విధానాల్ని అందుబాటులోకి తేవాలని వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవోకు వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు సూచించారు. ఇందుకు సంబంధించి ఆరోగ్యశ్రీ సీఈవో అవసరమైన చర్యల్ని తీసుకోవడంతో పాటు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు ఎటువంటి సమస్యలకు గురికాకుండా ఉండేందుకు తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఉత్తర్వుల్లో సూచించారు. ఆర్థిక శాఖ సమ్మతి మేరకే ఈ ఉత్తర్వుల్ని జారీ చేశామని కృష్ణబాబు స్పష్టం చేశారు. కాగా తాజాగా జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగులు, పెన్షన్లర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.