దేశంలో వరుసగా ఎలక్ట్రిక్ వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. వేసవిలో ఎండల కారణంగా బ్యాటరీలు వేడెక్కి ఎలక్ట్రిక్ వాహనాలు పేలుతున్నాయి. దీంతో ఆయా వాహనాల జోలికి వెళ్లాలంటేనే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా విజయవాడలోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. విజయవాడ సూర్యారావు పేటలోని గులాబీ తోటలో ఎలక్ట్రిక్ బైక్ పేలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. 40 శాతం గాయాలు కావడంతో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరు చిన్నారులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఉపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో వాళ్ల పరిస్థితి కూడా సీరియస్‌గానే ఉన్నట్లు తెలుస్తోంది.
అసలు ఎలక్ట్రిక్ వాహనాలకు ఏమైంది? ఎందుకు పేలుతున్నాయి?
పెట్రోల్ ఖర్చు ఉండదు. చౌకగా వస్తుంది. అందులోనూ సబ్సిడీ. ఇక పొల్యూషన్ అన్నమాటే ఉండదు. ఇది ఎలక్ట్రికల్ వాహనాలకున్న అడ్వాంటేజ్. ఇదే సమయంలో ప్రజలంతా ఎలక్ట్రిక్ వాహనాల వైపే మొగ్గుచూపుతున్నారు. కానీ కొన్ని కంపెనీల ఎలక్ట్రిక్ బైక్స్ బాంబుల్లా పేలుతున్నాయి. ఎంతో మందిని బలితీసుకుంటున్నాయి. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలపై దేశ వ్యాప్త చర్చ మొదలైంది. ఇది ఎంత వరకు సేఫ్ అన్న టాక్ నడుస్తోంది. అసలు ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ బైక్ ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ధ్వని, వాయు కాలుష్యనియంత్రణకు ఈ-వాహనాలను ప్రొత్సహిస్తున్న క్రమంలో ఎలక్ట్రిక్ బైకుల్లో మంటలు రావడం, బ్యాటరీలు పేలడం కలకలం రేపుతున్నాయి. చాలా మంది మృతికి కారణమవుతున్నాయి.
ఇటీవల నిజామాబాద్‌లో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందున్నారు. జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ ఎస్‌బీఐ బ్యాంక్ ప్రాంతంలో నివాసం ఉండే కళ్యాణ్ రోజులాగే ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీని అర్ధరాత్రి సమయంలో ఇంట్లోని హాలులో చార్జింగ్ పెట్టాడు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి అదే హాల్‌లో పడుకున్నాడు. తెల్లవారుజామున బ్యాటరీ భారీ శబ్ధంతో పేలిపోయింది. అంతలోనే బ్యాటరీలోని కెమికల్ హాల్‌లో వ్యాపించి దాని ద్వారా మంటలు రామస్వామి, కమలమ్మ, కళ్యాణ్‌కు అంటుకున్నాయి. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించిన కృష్ణవేణికి సైతం గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన రామస్వామిని ఆయన కుమారుడు ప్రకాష్ చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు.గాయపడ్డ ముగ్గురు నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. బ్యాటరీని ఏడాదిన్నర నుండి వాడుతున్నట్లు గుర్తించారు. బాధితుల వాంగ్మూలం రికార్డు చేసిన పోలీసులు… వారు చెప్పిన విషయాల ఆధారంగా బ్యాటరీ అమ్మిన షాపు నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. బ్యాటరీకి సంబంధించిన టెక్నికల్ టీంను రప్పించి పేలుడుకు గల కారణాలను విశ్లేషించే పనిలో నిమగ్నమయ్యారు. బ్యాటరీ తయారీ దారుల నిర్లక్ష్యం ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇదే కాదు గతంలో ఎన్నో ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాదాలు కలవరం పుట్టించాయి. నెల రోజుల క్రితం తమిళనాడు వెల్లూరులో ఎలక్ట్రిక్ బైక్ పేలి తండ్రి, కూతురు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బైక్‌కు చార్జీంగ్ పెట్టి పడుకున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసు ఇంకా విచారణలోనే ఉంది.
ఇటీవల వరంగల్‌లో కూడా ఓ ఎలక్ట్రిక్ బైక్ దగ్ధమైంది. పార్కు చేసిన ఎలక్ట్రికల్ బైక్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎలక్ట్రిక్ బైక్ పూర్తిగా కాలిపోయింది. దీంతో జనం భయంతో పరుగులు తీశారు. అటు రాజమండ్రిలో కూడా ఈ-వాహనం అందరూ చూస్తుండగానే తగలబడిపోయింది. ఇలా వరుస ప్రమాదాలు చూస్తుంటే ఎలక్ట్రిక్ బైకులు ఎంత ప్రమాదకరంగా మారాయో అర్థమవుతోంది. ఒక్కటి కాదు రెండు కాదు నిత్యం ఎక్కడో చోట ఎలక్ట్రిక్ బైకులు పేలిపోతూ మనుషుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. అసలు ఇవి ఎంత వరకు సేఫ్ అన్న చర్చ మొదలైంది. పలు కంపెనీలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో వాటిని కొనేందుకు వినియోగదారులు వెనుకడగు వేస్తున్నారు. అటు ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాదంపై కేంద్రం అప్రమత్తమైంది. లోపాలున్న వెహికల్స్‌ను రీకాల్ చేయాంటూ హెచ్చరించింది. ఇప్పటికే దిగొచ్చిన కొన్ని కంపెనీలు.. తమ వాహనాలను వెనక్కి తీసుకుంటామని ప్రకటించాయి.
అయితే ఇటీవల ప్రమాదాలకు రెండు కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఒకటి సాంకేతికపరమైంది. రెండోది సామాజిక ఆర్థిక పరిస్థితులు. బ్యాటరీని పూర్తిగా పరిశీలించకపోవడం, తప్పుడు ఛార్జింగ్ పరికరం వినియోగం, త్వరగా మార్కెట్‌లోకి వాహనం లాంచ్ చేయాలనే తొందర.. ఈ కారణాలతోనే ఆయా కంపెనీలు భద్రతను గాలికి వదిలేస్తున్నాయి. ఈ వైఖరి వల్ల కంపెనీలు… భద్రత, ఫీల్డ్ టెస్టింగ్‌పై షార్ట్‌కట్‌లను తీసుకోవడానికి కారణమవుతున్నాయని కొంత మంది నిపుణులు చెబుతున్నారు. స్కూటర్లలో అమర్చే లిథియం అయాన్ బ్యాటరీలే పేలుడుకు కారణంగా తెలుస్తోంది. ఈ బ్యాటరీలతో జాగ్రత్తగా వ్యవహరించకపోతే అగ్ని ప్రమాదం జరిగే ముప్పు ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లిథియం అయాన్ బ్యాటరీలతో చాలా ఉపయోగాలు ఉన్నప్పటికీ వీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ బ్యాటరీలను వందల సార్లు చార్జింగ్ పెట్టుకోవచ్చు. వీటి బరువు కూడా తక్కువే. మిగతా బ్యాటరీలతో పోలిస్తే, వీటిలో ఉపయోగించే లోహాల ప్రమాదకర స్థాయిలు కూడా తక్కువే. అయితే ఇవి పూర్తిగా సురక్షితమైనవని కూడా చెప్పలేం.
లిథియం అయాన్ బ్యాటరీల్లో రెండు ఎలక్ట్రిక్ టెర్మినళ్లు ఉంటాయి. వీటి మధ్య ఎలక్ట్రోలైట్ ద్రావణం ఉంటుంది. బ్యాటరీని చార్జింగ్ పెట్టినప్పుడు దీనిలో ఆవేశపూరిత అయాన్లు ఒక ఎలక్ట్రోడ్ నుంచి మరొక ఎలక్ట్రోడ్‌కు పయనిస్తుంటాయి. అయితే ఈ ఎలక్ట్రోడ్‌ల మధ్య నుండే ఎలక్ట్రోలైట్ ద్రావణం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే ముప్పుంటుంది. ఇలా అరుదుగా జరుగుతుంటుంది. ముఖ్యంగా బ్యాటరీ దెబ్బ తిన్నప్పుడు.. విపరీతంగా వేడెక్కినప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఎలక్ట్రోలైట్ ద్రావణం ఉండే బ్యాటరీలను విమానాల్లో కూడా అనుమతించరు. అందుకే వాహనదారులు ఈ లిథియం అయాన్ బ్యాటరీలను వాడాలంటేనే జంకుతున్నారు.
ఏ బ్యాటరీలు ఎంత ఫాస్ట్‌గా ఛార్జింగ్ ఎక్కుతాయో అంతే ప్రమాదకరమైనవని ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ సంస్థ ఏథర్ తన బ్లాగ్‌లో పేర్కొంది. సరైన భద్రతా ప్రమాణాలు పాటించే కంపెనీల నుంచే ఈ బైక్‌లను కొనుగోలు చేయాలంటున్న నిపుణులు ఈ-బైక్ బ్యాటరీలను ఐదేళ్లకొకసారి మారిస్తే మంచిదని సూచిస్తున్నారు. ఏది ఎలా ఉన్నా వరుస ప్రమాదాలు ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్, తయారు చేసే కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. బ్యాటరీలను రీప్లేస్ చేయకపోతే సేల్స్ కూడా భారీగా పడిపోయే పరిస్థితి రావొచ్చు.