Site icon NTV Telugu

Schools Closed: పెద్దపులి కలకలం.. అక్కడ ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్లకు సెలవు ప్రకటన..

Schools Closed

Schools Closed

Schools Closed: రాజమండ్రి రూరల్ మండలం తొర్రేడు ప్రాంతంలో పెద్దపులి కలకలం సృష్టించింది. తొర్రేడు హైస్కూల్ సమీపంలోని అరటి తోటలో పెద్దపులి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. జనావాసాలకు అతి సమీపంలో అరటి తోటల్లో పులి సంచరిస్తుండటంతో గ్రామాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రస్తుతం పులి సీతానగరం మండలం రాపాక గ్రామం వైపు వెళ్లినట్లు అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. పెద్దపులిని పట్టుకునేందుకు అటవీశాఖ 15 ట్రాప్ కెమెరాలు, రెండు బోనులు ఏర్పాటు చేసి, డ్రోన్ కెమెరాల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టింది. పులి సంచరించే అవకాశం ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీ సిబ్బంది ద్వారా ఫారెస్ట్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పులి భయంతో గ్రామస్తులు రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా బిక్కుబిక్కుమంటూ గడిపారు.

Read Also: Dhurandhar 2 – Toxic : ధురంధర్ 2 వర్సెస్ టాక్సిక్.. సౌత్ ఆడియెన్స్ ఓటు ఎవరికో?

పెద్దపులి సంచరణ నేపథ్యంలో సీతానగరం, కోరుకొండ, రాజమండ్రి రూరల్ ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈవేళ ఒకరోజు సెలవు ప్రకటించారు. పులి సంచరించే అవకాశం ఉన్న మార్గాల పరిధిలో ముందస్తు భద్రత చర్యలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. అయితే ఈవేళ నిర్వహించనున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు యథావిధిగా జరుగుతాయని ప్రాంతీయ ఇంటర్మీడియట్ అధికారి ఐ. శారద తెలిపారు.

Exit mobile version