Site icon NTV Telugu

Kadiyam Nursery Gang R*ape and Murder Case: కడియం నర్సరీలో మహిళపై సామూహిక అత్యాచారం, హత్య.. కోర్టు సంచలన తీర్పు..

Gang Rape And Murder

Gang Rape And Murder

Kadiyam Nursery Gang Rape and Murder Case: సంచలనం సృష్టించిన తూర్పుగోదావరి జిల్లాలోని కడియం నర్సరీలో మహిళపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో.. కీలక తీర్పు వెలువరించింది కోర్టు.. కడియం మండలంలో జరిగిన నర్సరీ మహిళపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితులైన నలుగురు యువకులకు మరణం వరకూ జీవిత ఖైదు విధిస్తూ రాజమండ్రి కోర్టు తీర్పు వెల్లడించింది.

Read Also: Bengal Elections: మమతా సర్కారుకు షాక్.. సీఎస్, డీజీపీల ట్రాన్స్‌ఫర్..

కాగా, కడియం మండలం బుర్రిలంక గ్రామానికి చెందిన 43 ఏళ్ల వివాహిత రౌతు కస్తూరి స్థానిక నర్సరీలో పని చేసేది. 2024 అక్టోబర్ 15న ఆమె నర్సరీ పనికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు ఫోన్ చేసినప్పటికీ ఆమె మొబైల్ స్విచ్ ఆఫ్‌గా వచ్చింది. దీంతో వారు చుట్టుపక్కల వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. తరువాత 2024 అక్టోబర్ 16న కస్తూరి భర్త కడియం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో 2024 అక్టోబర్ 17న చొప్పల్ల లాకుల వద్ద కాలువలో కస్తూరి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. దీంతో ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టారు.

నేరం ఎలా జరిగింది
పోలీసుల దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం, నర్సరీలో మద్యం సేవిస్తున్న నలుగురు యువకులు పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న కస్తూరిని అడ్డగించారు. ఆమె కాళ్లు చేతులు కట్టి నర్సరీ మొక్కల మధ్యకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను హత్య చేసి సమీపంలోని ప్రధాన పంటకాలువలో పడేశారు. అయితే, ఈ కేసులో బుర్రిలంక గ్రామానికి చెందిన దేవర యేసు (21), వెలుబుడి ప్రవీణ్ (21), లోకిన జయప్రసాద్ (19), అలాగే పొట్టిలంక గ్రామానికి చెందిన దాసరి సురేష్ (22) అనే నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. సౌత్ జోన్ డీఎస్పీ భవ్య కిషోర్ ఆధ్వర్యంలో పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 70(1), 103(1), 238 రీడ్ విత్ 3(5) ప్రకారం కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించారు. అనంతరం పూర్తి దర్యాప్తు చేసి చార్జ్ షీట్ దాఖలు చేశారు.

కోర్టు తీర్పు
ఈ కేసును ఫాస్ట్ ట్రాక్‌గా విచారించిన రాజమండ్రి నాలుగవ అదనపు జ్యుడీషియల్ కోర్టు న్యాయమూర్తి నిందితుల నేరం రుజువైన నేపథ్యంలో నలుగురికి మరణం వరకూ జీవిత ఖైదు శిక్ష విధించారు. అయితే, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ మాట్లాడుతూ మహిళలపై జరిగే దారుణ నేరాలపై కఠినంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్‌గా పరిగణించి కేవలం 11 నెలల్లోనే విచారణ పూర్తి చేశామని చెప్పారు. మొత్తం 14 నెలల్లోనే నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.

Exit mobile version