Rabi Paddy Procurement: రైతులకు గుడ్‌న్యూస్.. రేపటి నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

  • రేపటి నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లు..
  • 1,917 కొనుగోలుకేంద్రాలలో 23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు..
  • ధాన్యం కొన్న 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ..
Nadendla Manohar

Nadendla Manohar

Rabi Paddy Procurement: రైతులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. రేపటి నుంచి రబీ సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో ఆయన ఈ వివరాలు తెలియజేశారు.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,917 కొనుగోలు కేంద్రాల ద్వారా సుమారు 23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు.

Read Also: EV Scooters: టీవీఎస్ iQube, ఏథర్, బజాజ్ చేతక్.. ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్? ధర, రేంజ్ పూర్తి వివరాలు

ఇక, ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తామని మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు. రైతులు తమ పంటకు సరైన ధర పొందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ధాన్యం నిల్వ మరియు రవాణా విషయంలో కూడా ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేసింది. మొత్తం 5.40 కోట్ల గోతాలను సిద్ధం చేసినట్లు, గోతాల కొరత రాకుండా మిల్లర్లతో ఇప్పటికే చర్చలు జరిపినట్లు తెలిపారు. అలాగే ధాన్యం రవాణా కోసం 17,200 లారీలను జీపీఎస్ సదుపాయంతో సిద్ధం చేసినట్లు వెల్లడించారు. మొత్తంగా, ఈసారి రబీ ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా, వేగంగా జరిగేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు మంత్రి నాదెండ్ల మనోహర్‌..