AP BSF Jawan Dies on Indo-Bangladesh Border: స్మగ్లర్ల వేటలో విషాదం.. ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దులో ఏపీ జవాన్ మృతి..

Ap Bsf Jawan Dies On Indo B

Ap Bsf Jawan Dies On Indo B

AP BSF Jawan Dies on Indo-Bangladesh Border: భారత్-బంగ్లాదేశ్‌ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీఎస్ఎఫ్ జవాన్ ప్రాణాలు కోల్పోయారు. అస్సాంలో పశువుల స్మగ్లర్లను పట్టుకునే క్రమంలో ప్రమాదవశాత్తూ బరాక్ నదిలో గల్లంతైన జవాన్ కె. వేణు మృతదేహం మూడు రోజుల తర్వాత కుషియారా నదిలో లభ్యమైంది. ఈ విషాద ఘటనతో ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లికి చెందిన కె. వేణు బీఎస్ఎఫ్ 75వ బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దులోని అస్సాం ప్రాంతంలో విధుల్లో భాగంగా పశువుల స్మగ్లర్లను పట్టుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆయన బరాక్ నదిలో గల్లంతయ్యారు. అప్పటి నుంచి జవాన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మూడు రోజుల తర్వాత కుషియారా నదిలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు.

ఐదు నెలల పసిపాపను వదిలి వెళ్లిన జవాన్
కె. వేణుకు కేవలం 30 ఏళ్ల వయసు మాత్రమే. రెండేళ్ల క్రితమే ఆయనకు వివాహమైంది. భార్య, ఐదు నెలల పసిపాప ఉన్నారు. ఇటీవలే తన బిడ్డతో కలిసి వారం రోజుల పాటు గడిపిన వేణు తిరిగి విధుల్లో చేరేందుకు వెళ్లారు. ఇంతలోనే ఆయన మరణవార్త కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. చిన్న వయసులోనే కుటుంబానికి దూరం కావడంతో భార్య, బిడ్డ పరిస్థితిని తలచుకుని గ్రామస్థులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఇక, జవాన్ వేణు మృతితో గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన భౌతికకాయం రేపు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకోనుంది. అనంతరం స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ రక్షణ కోసం విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన వేణుకు గ్రామస్థులు నివాళులర్పించేందుకు సిద్ధమవుతున్నారు..