తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణా అరికడతామని జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాధ్ బాబు అన్నారు. పి.గన్నవరం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాధ్ బాబు పోలీసులకు దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం, పోలీసు శాఖ ఫోకస్ మొత్తం గంజాయి పైనే ఉందన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో గంజాయి సాగు తక్కువగా ఉన్నప్పటికీ రవాణా మాత్రం ఇక్కడి నుండే జరుగుతుందన్నారు. ప్రజా రవాణా ద్వారా అక్రమార్కులు గంజాయిని తరలిస్తున్నారని, పోలీసులు అప్రమత్తంగా వుండాలని సూచించారు.
గంజాయిని పూర్తి స్థాయిలో అరికట్టేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామన్నారు. అలాగే, జిల్లాలో వివిధ ప్రాంతాల్లో నాటుసారా కాస్తున్నారని, దీనిని పూర్తిగా అరికట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.
నాటుసారా తయారు చేసే వ్యక్తుల చేత ప్రమాణాలు చేయించి పూర్తిగా తయారుచేయడం మానేసినవారికి వేరే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎస్పీ రవీంద్రనాథ్ తెలిపారు. పదే పదే నాటుసార కాస్తూ పట్టుబడ్డవారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు హెచ్చరించారు.