టీడీపీ అధినేత చంద్రబాబుపై డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు సెటైర్లు వేశారు. ఏపీలో టీడీపీ నిర్వహిస్తున్న బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన కామెంట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలు చంద్రబాబును బాదుతారేమోనని.. ఈ విషయాన్ని చంద్రబాబునే అడగాలని కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి టీడీపీ నేతలు ఏదో విమర్శలు చేస్తూనే ఉన్నారని.. కానీ తమ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఒక్క అర్హుడికీ లబ్ధి చేకూర్చేలా ప్రయత్నిస్తోందన్నారు. చంద్రబాబు హయాంలో పచ్చ చొక్కాలు వేసుకున్న వారికి మాత్రమే లబ్ధి చేకూరేదని డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు ఆరోపించారు.
అటు ఏపీలో రూ. 1800 కోట్ల మేర పెండింగులో ఉన్న నరేగా బిల్లుల చెల్లింపులను వెంటనే పూర్తి చేసేలా ఆర్ధిక శాఖ అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారని డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు తెలిపారు. నరేగా నిధులతో నిర్మించే భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. సిమెంట్ కొరత రాకుండా.. సిమెంట్ కంపెనీలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నామని పేర్కొన్నారు. సిమెంట్ సరఫరా విషయంలో ప్రత్యేకంగా నోడల్ అధికారిని నియమిస్తున్నామన్నారు. గ్రామాల్లో మురుగు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. క్లాప్ మిత్రలకు పెండింగ్ జీతాలు చెల్లింపులు జరుపుతామని.. జగనన్న కాలనీలకు ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం, కుళాయి కనెక్షన్లు అందిస్తామని చెప్పారు. గ్రామాల్లో రహదారుల నిర్మాణం కోసం రూ. 1030 కోట్లకు టెండర్లు పిలవబోతున్నట్లు డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు వెల్లడించారు. ఆర్‌అండ్‌బీ తరహాలోనే పంచాయతీ రాజ్ రోడ్ల నిర్మాణం, బిల్లులను బ్యాంకుల ద్వారా కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తామన్నారు. పంచాయతీ రాజ్ శాఖలో జరిగే పనులకు నిధుల కొరత లేదని బూడి ముత్యాలనాయుడు స్పష్టం చేశారు.
Viral: వీరాభిమాని అంటే ఇతడే.. జనసేన మేనిఫెస్టోతో పెళ్లి శుభలేఖ