అనంతపురం జిల్లా వాసులు ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యారు. తోలుబొమ్మల తయారీలో ప్రసిద్ధి చెందిన అనంతపురం జిల్లా నిమ్మలకుంట గ్రామం సోమవారం ఆనందంతో పులకించిపోయింది. తన ఒడిలో దశాబ్దాలుగా తోలుబొమ్మలు తయారు చేస్తూ గ్రామం పేరును దశదిశలా వ్యాపింపజేసిన కళామతల్లి ముద్దుబిడ్డ దళవాయి చలపతిరావుకు విశిష్ఠ పురస్కారం దక్కినందుకు పరవశించింది. సుప్రసిద్ధ కళాకారుడు దళవాయి చలపతిరావు సోమవారం ఢిల్లీలో ఉన్నత పురస్కారమైన పద్మశ్రీని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకోవడంతో ఆయన కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్థులు సంతోషంలో మునిగిపోయారు.
ఓ కుగ్రామంలో పుట్టిన చలపతిరావు 66 ఏళ్లుగా తోలుబొమ్మల తయారీ, ప్రదర్శనలో ఖ్యాతి గడించారు. ఎన్నో కష్టాలు అనుభవించినా ధైర్యం కోల్పోకుండా తోలుబొమ్మల తయారీని నమ్ముకున్నారు. 78 ఏళ్ల వయసులో పద్మశ్రీ అవార్డు అందుకోవడంతో భార్య సరోజమ్మ, కుమారులు రమణ, వెంకటేష్, కుమార్తెలు తిరుపతమ్మ, వెంకటమ్మ, లలితమ్మ సంతోషం వ్యక్తం చేశారు. చలపతిరావుతో ఫోన్‌లో మాట్లాడి ఆనందం పంచుకున్నారు. తోటి కళాకారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు దళవాయికి అభినందనలు తెలిపారు.