Site icon NTV Telugu

Purandeswari Vs GVL: ఏపీ బీజేపీలో మరో కొత్త వివాదం.. జీవీఎల్‌కు పురంధేశ్వరి కౌంటర్‌

Purandeswari Vs Gvl

Purandeswari Vs Gvl

Purandeswari Vs GVL: ఆంధ్రప్రదేశ్‌లో కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా ఎపిసోడ్‌ కాకరేపుతుండగా.. రాష్ట్ర బీజేపీలో మరో వివాదం మొదలైంది.. సీనియర్‌ నేత, బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్‌ నరసింహారావు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత పురంధేశ్వరి.. అన్ని పథకాలకూ ఎన్టీఆర్‌, వైఎస్‌ఆర్‌ పేర్లే పెడుతున్నారంటూ గురువారం రోజు జీవీఎల్ వ్యాఖ్యానించారు.. అన్ని పథకాలకు ఆ ఇద్దరి పేర్లానా? ఇంకా ఎవరూ లేరా? అని ప్రశ్నించారు జీవీఎల్‌.. రాష్ట్రంలో రాజకీయాలు కేవలం.. రెండు పార్టీలు, రెండు కుటుంబాలకు సంబంధించినది కాదన్న ఆయన.. అన్నింటికీ వైఎస్‌ఆర్ పేరేనా? వైఎస్‌ఆర్‌ అంటే అందరికీ అభిమానమే.. కానీ, అన్ని పథకాలకు ఆ పేర్లేనా..? మిగతా నేతలు ఎవరూ కనిపించరా? జిల్లాలకు ఇతరుల పేర్లు పెట్టినప్పుడు వంగవీటి మోహన రంగారావు పేరు ఎందుకు పెట్టరని ప్రశ్నించారు జీవీఎల్‌.. అయితే, దీనికి సోషల్‌ మీడియా వేదికగా కౌంటర్‌ ఇచ్చారు పురంధేశ్వరి..

Read Also: Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

ఆ ఇద్దరు కాదు, ఆ మహానుభావులు.. అంటూ జీవీఎల్‌ మాట్లాడిన వీడియోను షేర్‌ చేస్తూ.. “అన్నీ ఇద్దరి పేర్లేనా”..? అనే ఆయన ప్రశ్నకు కౌంటర్‌గా కామెంట్‌ పెట్టారు పురంధేశ్వరి.. ఒకరు తెలుగు జాతికి గుర్తింపుని తీసుకొని వచ్చి, పేదలకు నిజమైన సంక్షేమం- 2 రూపాయలకే కిలో బియ్యం, పక్కా గృహాలు, జనతా వస్త్రాలు, మహిళా విశ్వవిద్యాలయం వంటివీ ప్రజలకు అందిస్తే , మరో కరు ఫీజు రీయింబర్స్‌మెంట్, 108 ఉచిత అంబులెన్సు సేవలు, ఆరోగ్యశ్రీ అందించారని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.. ఎన్డీఆర్, వైఎస్సార్‌ పేదలకు నిజమైన సంక్షేమం అందించారని కొనియాడారు పురంధేశ్వరి.. మొత్తంగా.. ఇద్దరు బీజేపీ నేతల మధ్య.. అన్నింటికీ ఆ ఇద్దరి పేర్లేనా? అనే వ్యాఖ్య వివాదానికి ఆజ్యం పోసినట్టు అయ్యింది.

Exit mobile version