ఏపీకి మరో తుఫాన్ ముప్పు ముంచుకొస్తోంది. అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మరో రెండ్రోజుల్లో తుఫాన్‌గా మారే అవకాశం ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అండమాన్ సముద్రం పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని స్పష్టం చేసింది వాతావరణ శాఖ. మరికొన్ని గంటల్లో ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. తర్వాత మరో 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి… తర్వాత తుఫాన్‌గా బలపడుతుందని అంటున్నారు వాతావరణ నిపుణులు.
తుఫాన్ వాయువ్య దిశగా కదులుతూ… డిసెంబరు 4 నాటికి ఉత్తర కోస్తా ఆంధ్ర-దక్షిణ ఒడిశాల మధ్య తీరాం దాటే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. తుఫాన్ ప్రభావం వల్ల రేపట్నుంచి ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా. ఉభయ గోదావరి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపింది. అలాగే, తీర ప్రాంతంలో గంటకు 90 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, సముద్ర అలలు ఉవ్వెత్తున ఎగసిపడే అవకాశం ఉందని తెలిపింది.
అందువల్ల మత్స్యకారులు వచ్చే రెండు రోజులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. అంతేకాదు… పోర్టులను కూడా అప్రమత్తం చేసింది వాతావరణ శాఖ. వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. జాతీయ విపత్తుల నిర్వహణ కమిటీ సమీక్ష జరిపింది. ముందస్తు జాగ్రత్తలపై ఏపీ, ఒడిశా, బెంగాల్ సీఎస్‌లతో చర్చించింది. ఆర్మీ, నేవినీ సిద్దం చేసింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం 32 ఎన్టీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచింది జాతీయ విపత్తుల నిర్వహణ కమిటీ.
