Site icon NTV Telugu

Cyclone: ముంచుకొస్తున్న తుఫాన్‌.. ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అప్రమత్తమైన ప్రభుత్వం..

Rains

Rains

బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం తీరం వైపు దూసుకొస్తుంది.. దక్షిణ అండమాన్‌లో ఉన్న అల్పపీడనం పశ్చిమ వాయువ్యంగా పయనించి నిన్న ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా, సాయంత్రానికి వాయుగుండంగా మారిపోయింది.. ఇవాళ సాయంత్రానికి తుఫాన్‌గా మారుతుందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.. పశ్చిమ వాయువ్యంగా పయనిస్తూ నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించి రేపు ఉదయం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాల్లో తీరం దిశగా రాబోతోంది.. ఆ తర్వాత పశ్చిమ వాయువ్యంగానే పయనిస్తూ ఈనెల 9వ తేదీ రాత్రి లేదా 10న తెల్లవారుజామున ఉత్తర తమిళనాడులో చెన్నైకు దక్షిణాన తీరం దాటుతుందని ఐఎండీ చెబుతోంది.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవబోతున్నాయి.. దీంతో, ప్రభుత్వ యంత్రాంగం తుఫాన్‌నుంచి ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతోంది.

Read Also: Jayaho BC Maha Sabha: నేడు జయహో బీసీ మహాసభ.. విజయవాడలో ట్రాఫిక్‌ ఆంక్షలు..

రేపటి నుంచి దక్షిణ కోస్తాలో విస్తారంగా, రాయలసీమలో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణకేంద్రం అప్రమత్తం చేసింది.. తుఫాన్‌ తీరం దిశగా వచ్చే క్రమంలో ఈ నెల 9వ తేదీన దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేక ప్రాంతాలు, ఉత్తర కోస్తాలో పలు ప్రాంతాల్లో సాధారణ వర్షాలు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీనుంచి అతిభారీ వర్షాలు.. ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య, కడప, సత్యసాయి, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.. ఇక, 10వ తేదీన నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీనుంచి అతిభారీ, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, కడప, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది..

ఐఎండి వాతావరణ సూచనల ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతంలోని అల్పపీడనం మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు వాయుగుండంగా బలపడిందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. ప్రస్తుతానికి వాయుగుండం కారైకాల్‌కు తూర్పు-ఆగ్నేయంగా 970కి.మీ., చెన్నైకి 1020 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపారు. ఇది క్రమంగా పశ్చిమ-వాయువ్య దిశగా పయనిస్తూ ఇవాళ సాయంత్రానికి తుఫానుగా బలపడనుందన్నారు. రేపు ఉదయానికి నైరుతి బంగాళాఖాతం సమీపంలోని ఉత్తర తమిళనాడు- దక్షిణకోస్తాంధ్ర తీరాలకు చేరుకుంటుందని అన్నారు. ఆ తదుపరి 48 గంటలు ఉత్తర తమిళనాడు – దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు ఆనుకుని కొనసాగుతుందని తెలిపారు. దీని ప్రభావంతో రేపటి నుంచి మూడు రోజులపాటు దక్షిణకోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మరియు రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి సూచనలు జారీచేశామన్నారు. దక్షిణకోస్తా – తమిళనాడు తీరాల వెంబడి శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. వేటకు వెళ్ళిన మత్స్యకారులు వెంటనే వెనక్కి తిరిగి రావాలన్నారు. అత్యవసర సహయం, సమాచారం కోసం విపత్తుల సంస్థలో 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 1070, 18004250101, 08632377118 సంప్రదించాలన్నారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Exit mobile version