Arnab Cyclone Effect : అర్నాబ్ బీభత్సం.. అనకాపల్లి తీరంలో భయానక పరిస్థితులు.!

  • అనకాపల్లి తీర ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావం
  • బలమైన గాలులకు నేలకూలుతున్న చెట్లు
  • పూడిమడక, సీతపాలెంలో ప్రజల్లో ఆందోళన
  • లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలిస్తున్న అధికారులు
Anakapalli

Anakapalli

బంగాళాఖాతంలో ముంచుకొస్తున్న ‘అర్నాబ్’ తీవ్ర తుఫాన్ అనకాపల్లి జిల్లాలో తన ప్రతాపాన్ని చూపుతోంది. ఉగ్రరూపం దాల్చిన ఈ తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల భారీ వేగంతో విరుచుకుపడ్డ భీకర గాలులకు జిల్లాలోని తీర ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి. ముఖ్యంగా పూడిమడక, సీతపాలెం ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. ఎడతెరిపి లేకుండా దంచి కొడుతున్న భారీ వర్షానికి తోడు వీస్తున్న ఈదురు గాలుల తాకిడికి గంగపుత్రులు గజగజా వణుకుతున్నారు.

నేలకూలుతున్న చెట్లు.. ఎగిరిపోతున్న పైకప్పులు

తుఫాన్ ఉధృతికి బలమైన ఈదురు గాలులు వీస్తుండటంతో తీర ప్రాంతాల్లో భారీ వృక్షాలు, చెట్లు వేళ్లతో సహా నేలకొరుగుతున్నాయి. పలు చోట్ల ఇళ్ల పైకప్పులు గాలికి ఎగిరిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిరంతరం కురుస్తున్న వర్షాలు, భయానక శబ్దాలతో కూడిన గాలుల కారణంగా మత్స్యకారుల కుటుంబాలు ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో తీర ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అప్రమత్తమైన యంత్రాంగం.. సురక్షిత ప్రాంతాలకు తరలింపు

తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ముందస్తు చర్యల్లో భాగంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితులు మినహా ఎవరూ బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, సహాయక చర్యలను ముమ్మరం చేసేందుకు అధికార బృందాలు రంగంలోకి దిగాయి.