ఇటీవల ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సీపీఎం పార్టీపై చేసిన వ్యాఖ్యలకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాస రావు కౌంటర్ ఇచ్చారు. చీప్ లిక్కరుపై బీజేపీకి అంత మోజు ఉంటే వాళ్ల ఆఫీసుల ముందు పెట్టి అమ్ముకోవచ్చునని ఆయన ఎద్దేవా చేశారు. చీప్ రాజకీయాలు చేసి ప్రజల దృష్టిని మద్యంపై మళ్లించే ప్రయత్నం చేస్తున్న బీజేపీని విధానాలను ప్రజలు ఛీ కొడుతున్నారన్నారు. కమ్యూనిస్టులు పెరుగుతున్నారనే నిస్పృహ సోము వీర్రాజు మాటల్లో కన్పిస్తోందని, తమతో సఖ్యతగా ఉండే పార్టీలను మింగేయడం బీజేపీ నైజం అని ఆయన ఆరోపించారు.
బీజేపీ విషయంలో వైసీపీ-టీడీపీలు వైఖరి మార్చుకోకుంటే ఆ పార్టీలే ఫలితాన్ని అనుభవిస్తాయన్నారు. ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ వైసీపీ-టీడీపీలు బీజేపీతో పోరాడాతాయో లేదోననేది ఆ పార్టీలే తేల్చుకోవాలన్నారు. బీజేపీ విషయంలో వైసీపీ, టీడీపీలు రాజీ ధోరణితోనే ఉన్నాయని, ప్రజల మేలు కోసం బీజేపీతో ప్రధాన పార్టీలు రాజీధోరణిని పక్కన పెట్టాలన్నారు. సమస్యలపై పోరాడేందుకు ప్రజలే ముందుకొస్తున్న పరిస్థితి వస్తోందని, ఎయిడెడ్ పాఠశాలల విషయంలో ఉద్యమాలతో ప్రభుత్వం వెనక్కు తగ్గిందన్నారు.