NTV Telugu Site icon

CPI Ramakrishna: సీమగర్జన కార్యక్రమం.. ఎవరిని మోసం చేయడానికి?

Cpi Ramakrishna On Ys Jagan

Cpi Ramakrishna On Ys Jagan

CPI Ramakrishna Fires On YCP Government: ఈనెల 5వ తేదీన కర్నూల్‌లో వైసీపీ చేపట్టనున్న ‘సీమ గర్జన’ కార్యక్రమంపై సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు చేయాల్సిన ఉద్యమాలను అధికార పార్టీ చేస్తోందని.. వైఎస్ జగన్‌ది రివర్స్ ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. ఎవరిని మోసం చేయడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నారని, ఇందుకు జగన్ ప్రజలకు సమాధానం చెప్పాల్సిందేనని నిలదీశారు. కర్నూల్‌లో హైకోర్టు పెడతామంటే, ఎవరు అడ్డం వచ్చారని ప్రశ్నించారు. కర్నూల్‌లో హైకోర్టు పెడతామని చెప్పి, పెట్టకుండా మోసం చేసి, ఈరోజు సీమ గర్జన పేరుతో ధర్నా పెడతామని ప్రభుత్వం అంటోందని మండిపడ్డారు. సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున వాదించిన న్యాయవాది.. హైకోర్టు అమరావతిలో ఉంటుందని చెప్పారన్నారు.

మూడున్నర ఏళ్లలో రాయలసీమకు ఏం చేశారని జగన్ ప్రభుత్వాన్ని రామకృష్ణ ప్రశ్నించారు. హంద్రి నీవాను రెండింతలు చేస్తానని మాటిచ్చి, ఇప్పుడు కనీసం నీళ్లు కూడా ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. సీఎం సొంత నియోజకవర్గంలో గండికోట ప్రాజెక్టు ఉన్నా.. ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు బయటకు వెళ్ళిపోతున్నాయని, వాటి అనుబంధ పరిశ్రమలు రాష్ట్రానికి రాకుండా రాకుండా దూరంగా ఉన్నాయని అన్నారు. అమర్ రాజా కంపెనీ ద్వారా 9000 మందికి ఉపాధి ఇచ్చారని.. 50 వేల మంది దాని ద్వారా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉపాధి పొందుతారన్నారు. కానీ, ఇప్పుడు ఆ అమర్ రాజా కంపెనీ తెలంగాణకు తరలిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరి తర్వాత ఒకరు రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నారని.. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదని ఫైర్ అయ్యారు.

కడపలో స్టీల్ బ్యాండ్ పెడతామని శంకుస్థాపన చేశారని.. ఆ ప్రాజెక్ట్ పది అడుగులు సైతం ముందుకు వెళ్లడం లేదని రామకృష్ణ చెప్పారు. వైసీపీ దౌర్జన్యాలకు భయపడి, ఏ ఒక్కరు కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం లేదని ఆరోపణలు చేశారు. కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఈ నెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు కడపలో పాదయాత్ర చేస్తామన్ననారు. ఈ పాదయాత్రకు ప్రజాసంఘాలను, రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తున్నామని పిలుపునిచ్చారు.