Site icon NTV Telugu

Ramakrishna: చట్టాలు చేయాల్సిన సభలను భజన సభలుగా మార్చేశారు…!

చట్టాలు చేయాల్సిన సభలను భజన సభలుగా ఎలా మారుస్తారు..? అంటూ ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరుపై మండిపడ్డారు సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. ఈసారి జరిగిన అసెంబ్లీ సమావేశాలు సభ హుందాను దిగజార్చారన్న ఆయన.. 1953-2022 వరకు జరిగిన సమావేశాలలో ఎప్పుడూ ఇంత ఘోరంగా జరగలేదన్నారు.. ప్రజల సమస్యలు, పరిష్కారంపై చర్చే లేదు.. ఏక పక్షంగా నిర్ణయాలు ఆమోదించుకోవడం, ప్రతిపక్ష సభ్యులను తిట్టడానికే అసెంబ్లీ సమావేశాలా..? పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరితే అరెస్టులు చేస్తారా..? ప్రభుత్వ వైఫల్యాలను అడిగే స్వేచ్ఛ కూడా లేదా..? అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్‌ చేసి.. మీరు భజన‌ చేయించుకుంటారా..? మీకు భజన చేయడానికి అసెంబ్లీ సమావేశాలు దుర్వినియోగం చేస్తారా..? కోర్టులను కూడా తప్పుబట్టి నోటికి వచ్చినట్లు మాట్లాడతారా..? కోర్టు తీర్పు మీకు అనుకూలంగా రాకపోతే విమర్శలు చేస్తారా..? మీరు రాజ్యాంగ బద్ధంగా నిర్ణయాలు చేస్తే కోర్టుల జోక్యం అవసరం ఉండదు కదా..? చట్టాలు చేయాల్సిన సభలను భజన సభలుగా మారుస్తారా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

Read Also: Electric Bike Blast: పేలిన ఎలక్ట్రిక్ బైక్.. తండ్రి, కూతురు మృతి

జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా ఘటనపై సాక్షాత్తు సీఎం వైఎస్‌ జగన్‌ అసెంబ్లీలో అసత్యాలు చెప్పారని విమర్శించారు రామకృష్ణ.. ఏమీ జరగకపోతే ఎక్సైజ్ అధికారులు ఎలా చర్యలు తీసుకున్నారని నిలదీసిన ఆయన.. మరీ ఇంత పచ్చిగా అబద్దాలు ఆడటమేనా జగన్ విశ్వసనీయత..? సీఎం అబద్దాలు చెబుతుంటే.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు భజన చేస్తున్నారు అంటూ ఫైర్‌ అయ్యారు.. ఇక, మన స్పీకర్ తమ్మినేని సీతారాం ఆ కుర్చీకి ఉన్న పరువు తీస్తున్నారంటూ ఘాటుగా స్పందించారు రామకృష్ణ.. మంత్రి పదవి కోసం తమ్మినేని.. స్పీకర్ పదవిని దిగజార్చారని ఆరోపించిన ఆయన.. తమ్మినేనిని తప్పించి.. పద్ధతిగా నడుచుకునే వారికి స్పీకర్ బాధ్యత అప్పగించాలని సూచించారు. మరోవైపు.. ఈనెల 28, 29 తేదీలలో చేపట్టిన సమ్మెకు అందరూ మద్దతివ్వాలని పిలుపునిచ్చిన రామకృష్ణ.. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకునే నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

Exit mobile version