AP Special Status: రాజకీయ తీర్మానంలో ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించింది కాంగ్రెస్ పార్టీ.. రాయపూర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి.. ప్లీనరీ వేదికగా చేసిన రాజకీయ తీర్మానంలో ఏపీకి “ప్రత్యేక హోదా” అంశం ప్రస్తావించారు.. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇచ్చే అంశానికి కట్టుబడి ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.. ఇక, కొండ ప్రాంతాలున్న రాష్ట్రాలకు ప్రత్యేక తోడ్పాటు, సహాయం లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదని తీర్మానంలో పేర్కొంది కాంగ్రెస్.. ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను పునరుద్దరిస్తామని ప్రకటించింది.. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదాను కల్పిస్తామని తీర్మానంలో ప్రస్తావించారు.. లడక్‌ను రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ పరిధిలోకి చేర్చి, లడక్ ప్రాంత ప్రజల హక్కులను పరిరక్షిస్తామని ప్రకటించింది కాంగ్రెస్ పార్లీ ప్లీనరీ..
Read Also: Mega Power Star: ఆ ఘటన సాధించిన మొదటి ఇండియన్ హీరో చరణ్ మాత్రమే…
కాగా, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అంశాన్ని ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయనే విమర్శలు ఉన్నాయి.. రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక హోదా అమలుకు నోచకోలేదు.. ప్రత్యేక ప్యాకేజీ అనే అంశం తెరపైకి వచ్చింది.. కొన్నిసార్లు పార్లమెంట్‌లో అధికార, విపక్ష సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తినా.. ఆచరణలో హోదా మాత్రం అందని ద్రాక్షలా మారిపోయింది.. యూపీఏ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటిస్తే.. ఆ తర్వాత అధికారాన్ని చేపట్టిన ఎన్డీఏ మాత్రం దాని ఊసు ఎత్తడంలేదని విపక్షాలు మండిపడుతున్నాయి. ఇక, భారత్ జోడో యాత్ర సందర్భంగా ఏపీలో పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ.. ఏపీకి ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించిన విషయం విదితమే. మరోవైపు.. ఏపీకి ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయంగా కేంద్రం పలు సందర్భాలు స్పష్టం చేసింది.