NTV Telugu Site icon

సంప్రదింపులకు ఉద్యోగ సంఘాలను ఆహ్వానించిన మంత్రుల కమిటీ

ఏపీలో 11వ పీఆర్సీపై రచ్చ జరుగుతోంది. ఇటీవల సీఎం జగన్ ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. అంతేకాకుండా తమ సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతామన్నారు. ప్రభుత్వం తమ సమస్యలపై చెప్పుకునేందుకు సమయం ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ ఉద్యోగ సంఘ నేతలకు జీఏడీ సెక్రటరీ శశి భూషణ్ ఫోన్ చేసి రేపు మంత్రులతో చర్చలకు హాజరు కావాలని ఆహ్వానించారు. ఉద్యోగ సంఘాల నాయకులతో సంప్రదింపులకు మంత్రుల కమిటీ ఆహ్వానించింది.

రేపు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయం రెండో బ్లాక్‌కు రావాలంటూ ఉద్యోగ సంఘాల నాయకులకు సమాచారం ఇచ్చింది. ఉద్యోగులతో సంప్రదింపులకు, వారికి నచ్చజెప్పడానికి మంత్రులు బుగ్గన, బొత్స, పేర్నినాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల, సీఎస్‌ సమీర్‌ శర్మలతో ఒక కమిటీని ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఢిల్లీపర్యటనలో మంత్రి బుగ్గన, సీఎస్‌ ఉన్నందున మిగిలిన ముగ్గురూ ఉద్యోగులతో సంప్రదింపులకు అందుబాటులో ఉంటామని సమాచారం ఇచ్చారు.