ప్రపంచాన్ని వణికిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్.. భారత్‌లోకి ప్రవేశించింది.. క్రమంగా రాష్ట్రాలకు విస్తరిస్తోంది.. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఒమిక్రాన్ కేసు వెలుగు చూడడంతో.. ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసు బయటపడిన నేపథ్యంలో వైద్య, ఆరోగ్య రంగంపై సమీక్ష చేపట్టనున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమీక్ష సమావేశం జరగనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ ఒమిక్రాన్ కేసులు లేకపోయినా తీసుకోవాల్సిన ముందస్తు చర్యల పై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం వైఎస్ జగన్. కాగా, ఏపీలోని విజయనగరం జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. అతడు కూడా హోం క్వారంటైన్‌లోనే వైరస్‌ను జయించారని వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.
Read Also: ఒమిక్రాన్‌పై టీకా ప్రభావం ఎంత..? డబ్ల్యూహెచ్‌వో కీలక ప్రకటన
కాగా, ఐర్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తికి కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో ఈ నెల మొదటి వారంలో హైదరాబాద్‌లోని జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు శాంపిల్స్ పంపించారు అధికారులు.. అయితే, రిపోర్ట్స్ శనివారం రాత్రి అందిందని చెప్పారు. దాంట్లో ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది.. ఇక, హోమ్ క్వారంటైన్ తర్వాత శనివారం నిర్వహించిన వైద్యపరీక్షల్లో సదరు వ్యక్తికి నెగెటివ్‌గా తేలిందని తెలిపారు. మరోవైపు ఆ వ్యక్తితో కాంటాక్ట్ అయిన 40 మందికి కూడా పరీక్షలు చేశామని.. అందరికీ నెగెటివ్ వచ్చిందని వెల్లడించారు. విదేశాల నుంచి 15 వేల మంది రాష్ట్రానికి రాగా వీరిలో 12,900 మందిని గుర్తించామని.. వీరిలో 15 మందికి పాజిటివ్‌గా తేలిందని.. వీరి నమూనాలను కూడా హైదరాబాద్ ల్యాబ్‌కు పంపామన్నారు. 10 మంది ఫలితాలు వెలువడగా కేవలం ఒక్కరికి మాత్రమే పాజిటివ్‌గా నిర్ధారణ అయిందన్నారు. ఇక ఎవరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.