NTV Telugu Site icon

CM YS Jagan: నేడు తిరువూరులో సీఎం పర్యటన.. వారికి ఖాతాల్లో ఈ రోజే సొమ్ము జమ..

Cm Ys Jagan

Cm Ys Jagan

CM YS Jagan: నేడు ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో పర్యటించనున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఇక, ఈ సందర్భంగా విద్యార్ధులకు మరోసారి శుభవార్త చెబుతూ.. పేద విద్యార్ధులు ఉన్నత చదువులు చదివేందుకు ఉద్దేశించిన జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి సొమ్మును ఈ రోజు విడుదల చేయనున్నారు.. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరిగే సభలో బటన్ నొక్కి లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లో నగదు జమచేయనున్నారు సీఎం జగన్‌.. జగనన్న విద్యా దీవెన కింద గత ఏడాది (2022) అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి తిరువూరులో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి నేరుగా 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లు జమ చేయనున్నారు. విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే ప్రభుత్వం చెల్లిస్తున్న విషయం విదితమే.

Read Also: Bandi Sanjay : నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం ఇవ్వాల్సిందే

ఉన్నత విద్యకు ప్రోత్సాహకంగా.. జాబ్‌ ఓరియెంటెడ్‌ కరిక్యులమ్‌తో ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు పాఠ్యాంశాల్లో మార్పులు చేసి నాలుగేళ్ళ ఆనర్స్‌ డిగ్రీ కోర్సులు, విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేలా కోర్సులు అందుబాటులోకి తెచ్చింది జగన్‌ సర్కార్‌.. కరిక్యులమ్‌లో 10 నెలల కంపల్సరీ ఇంటర్న్‌షిప్‌ పెట్ట­డం ద్వారా విద్యార్థులను పరిశ్రమల అవసరాలకు అను­గుణంగా తీర్చిదిద్దుతోంది. 40 అంశాలలో నైపుణ్యం పెంపొందించేలా 1.62 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే 1.07 లక్షల మందికి మైక్రోసాఫ్ట్‌ టెక్నాలజీలో, 73 వేల మందికి ఇతర అత్యాధునిక సాంకేతిక అంశాల్లో శిక్షణ పూర్తి చేసి, సర్టిఫికెట్స్‌ పంపిణీ చేసింది. దేశంలో ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో 1.75 లక్షల కంటే ఎక్కువ సర్టిఫికేషన్స్‌ సాధించిన ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలిచింది.. ఇంటర్‌ పాసై పై చదువులకు వెళ్లని విద్యార్థుల సంఖ్య 2018–19 లో 81,813 కాగా, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, సంస్కరణల వల్ల ఈ సంఖ్య గణనీయంగా తగ్గి 2022–23 నాటికి 22,387కు చేరింది.

ఇక, 2018–19లో 32.4 గా ఉన్న స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్‌) 2020–21 సంవత్సరానికి 37.2కు పెరిగింది. రాబోయే రోజుల్లో జీఈఆర్‌ శాతం 70కి తీసుకువెళ్లేలా చర్యలు తీసుకుంది. 2018–19లో సగటున ప్రతి 100 మంది బాలురకు 81 మంది బాలికలు కళాశాలల్లో చేరితే 2020–21 నాటికి ఈ సగటు 94కు పెరిగింది… 2018–19 లో 37,000 గా ఉన్న క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ గణనీయంగా పెరిగి 2021–22కి 85,000 కు చేరడం విశే­షం. విద్యా రంగంపై జగన్‌ ప్రభుత్వం గత 45 నెలల్లో మొత్తం రూ.57,642.36 కోట్లు వెచ్చించింది. 8వ తరగతి విద్యార్థులకు ఉచిత ట్యాబ్‌లు, నాడు –నేడు ద్వారా ఇప్పటికే అభివృద్ది చేసిన పాఠశాలల్లో 6 వ తరగతి పైన ప్రతి క్లాస్‌ రూమ్‌లో ఉండేలా 30,213 ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్స్, 10,038 ఫౌండేషన్, ఫౌండేషన్‌ ప్లస్‌ స్కూళ్లలో స్మార్ట్‌ టీవీలు ఏర్పాటు చేస్తోంది.

ఈరోజు ఎన్టీఆర్‌ జిల్లాలో తిరువూరులో పర్యటించనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.. ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి నుండి హెలికాప్టర్ లో బయలుదేరి ఉదయం 10.20 గంటలకు తిరువూరులోని వాహిని ఇంజినీరింగ్ కాలేజీకి చేరుకుంటారు.. అక్కడ 15 నిమిషాల విరామం అనంతరం 10.35 నుండి 10.45 వరకు ప్రజల నుండి వినతులు స్వీకరిస్తారు. 10.45 కు అక్కడి నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి 11.00 కు సభ జరిగే ప్రాంతానికి చేరుకుంటారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12.30 వరకు జగనన్న విద్యా దీవెన నగదు బదిలీకు సంబంధించి బటన్ నొక్కటం, తదుపరి విద్యార్థులు, ప్రజల నుద్దేశించి ప్రసంగిస్తారు. తిరిగి అక్కడి నుండి రోడ్డు మార్గంలో 12.40 కు వాహిని ఇంజినీరింగ్ కాలేజీ వద్దకు చేరుకొని 15 నిమిషాలు పాటు పార్టీకి చెందిన స్థానిక నాయకులతో ముచ్చటిస్తారు.. తదుపరి మధ్యాహ్నం 12.55 కు తిరిగి హెలికాప్టర్ లో తాడేపల్లికి బయల్దేరనున్నారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.

Show comments