ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.. వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్లతో పాటు.. పార్టీ జిల్లా అధ్యక్షుల్లోనూ మార్పులు చేర్పులు చేశారు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. అయితే, ఈ సమయంలో.. మాజీమంత్రి అవంతి శ్రీనివాస్‌కు హైకమాండ్ ఊహించని షాక్ ఇచ్చింది. విశాఖ జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతల నుంచి అనూహ్యంగా తొలగించింది. ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకు అవకాశం కల్పించింది. గత ఎన్నికల ముందు.. తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరిన అవంతి.. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తొలి కేబినెట్‌లో టూరిజం మంత్రిగా పనిచేశారు. అయితే, కేబినెట్ విస్తరణలో పదవి పోయిన తర్వాత అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది హైకమాండ్.. కానీ, ఇప్పుడు ఆ పదవి నుంచి కూడా తప్పించింది.
Read Also: Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్.. ఆ సినిమాకి ముహూర్తం ఫిక్స్?
అయితే, పార్టీ నాయకత్వంతో విభేదాలు, సమన్వయం కొరవడడంతో కొంత కాలంగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ అధ్యక్షతపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.. అదే సమయంలో ఆయన వ్యక్తిగత వ్యవహారాలు దుమారం రేపాయి. మహిళలతో సంభాషణలు ఆడియోలు లీక్ అవ్వడం, అవి తన వాయిస్‌లు కాదంటూ అవంతి వివరణ ఇచ్చుకోవడం జరుగుతోంది. కానీ, ఈ వ్యవహారం పార్టీ ప్రతిష్టాతకు ఇబ్బందికరంగానే మారిందట.. ఈ నేపథ్యంలో అవంతిని మార్చి అదే సామాజిక వర్గానికి చెందిన పంచకర్లకు అవకాశం కల్పించారు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. కాగా, వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఏపీ సీఎం.. ఓవైపు రీజనల్ కో ఆర్డినేటర్ల నియామకంలో మార్పులు చేర్పులు చేయడంతో పాటు.. మరోవైపు.. పార్టీ జిల్లా అధ్యక్షుల్లోనూ కొన్ని మార్పులు చేర్పులు చేశారు..
అందులో భాగంగా.. పార్వతీపురం మన్నెం జిల్లాకి అధ్యక్షుడిగా పుష్ప శ్రీవాణి స్థానంలో పరిశిష్ట రాజు.. విశాఖపట్నం జిల్లా బాధ్యతల నుంచి ముత్తంశెట్టి శ్రీనివాస్ అలియాస్ అవంతి శ్రీనివాస్‌ను తప్పించి ఆయన స్థానంలో పంచకర్ల రమేష్ కు అవకాశం కల్పించారు సీఎం వైఎస్ జగన్. గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా సుచరిత స్థానంలో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను నియమించిన జగన్.. ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా బుర్ర మధుసూదన్ యాదవ్ స్థానంలో జంకె వెంకటరెడ్డికి అవకాశం ఇచ్చారు.. కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా మేయర్ బీవై రామయ్యకు బాధ్యతలు అప్పగించగా.. ఇప్పటికే రాజీనామా చేశారు ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి. ఇక, అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా పైల నర్సింహయ్య, చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా భరత్‌ను కొనసాగించారు.. అనుబంధ విభాగాల కోఆర్డినేటర్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో తిరుపతి జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించారు. తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్థానంలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.