Site icon NTV Telugu

CM Jaganmohan Reddy:ఎల్లుండి కోనసీమలో సీఎం జగన్ పర్యటన

Jagan Eps

Jagan Eps

ఎల్లుండి కోనసీమ జిల్లాలో జరిగే సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాలలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించనున్నారు సీఎం జగన్. అంతకుముందు జగన్ పర్యటనతో అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుతో కలిసి అమలాపురం ఆర్డీవో వసంత రాయుడు హెలిప్యాడ్‌ ప్రాంతాన్ని పరిశీలించారు.వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ క్షేత్రస్థాయిలో పర్యటించి.. బాధితులతో మాట్లాడనున్నారు. కోనసీమ జిల్లాలోని 18 మండలాలకు సంబంధించి 51 లంక గ్రామాలు వరద నీటిలో మునిగి ఉన్నాయి. వరద ముంపుతో లంక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బాధితులకు అండగా ప్రజాపత్రినిధులు పర్యటన చేస్తున్నారు. బాధితులకు ధైర్యాన్ని ఇస్తున్నారు. వరద వల్ల పంటలు బాగా దెబ్బతిన్నాయి.

రాజోలు, పి. గన్నవరం నియోజకవర్గాల్లోని లంక ప్రాంతాల్లో సీఎం పర్యటన నేపథ్యంలో బాధితులకు జగన్ ఏం ప్రకటిస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గోదావరి వరద కారణంగా లంక గ్రామాల వాసులు ఇప్పటికే వరద నీటిలోనే వుండిపోయారు. పి.గన్నవరం మండలం గంటిపెదపూడి వద్ద నదిపాయ తెగి ఇబ్బందులు పడుతున్న నాలుగు గ్రామాల ప్రజలతో పాటు లంకల గన్నవరం, మానేపల్లిలో వరద బాధితులను జగన్ పరామర్శిస్తారు.

జిల్లాలో దెబ్బతిన్న పంటలను జగన్ పరిశీలిస్తారు. వరద నష్టాన్ని అంచనా వేసి తయారుచేసే నివేదికను సీఎం జగన్‌ కేంద్ర ప్రభుత్వానికి అందజేసి సాయం కోరనున్నారు. సీఎం జగన్ రాక సందర్భంగా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. జగన్ తన పర్యటనలో భాగంగా అన్నంపల్లి అక్విడెక్ట్‌ ప్రాజెక్టుకు చేరుకుంటారు. వరదలకు ఈ ప్రాజెక్టుకు జరిగిన నష్టాన్ని తెలుసుకుంటారని అధికారులు తెలిపారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే.

Adimulapu Suresh: వరదల్లో తక్షణం స్పందించాం.. వివాదాలు తేవద్దు

Exit mobile version