Site icon NTV Telugu

CM Jagan: దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశానికి గైర్హాజరు కానున్న సీఎం జగన్

Cm Jagan

Cm Jagan

CM Jagan: సెప్టెంబరు 3న తిరువనంతపురంలో దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ నేతృత్వంలో సోమవారం మధ్యాహ్నం సమావేశం నిర్వహించారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, సీఎస్‌ సమీర్‌ శర్మ, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశానికి సీఎం జగన్ గైర్హాజరు కానున్నారు. సెప్టెంబర్ 2న వైఎస్ఆర్ వర్ధంతి నేపథ్యంలో ఆయన దూరం కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఆర్థిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ నేతృత్వంలో టీం ఈ సమావేశానికి హాజరుకానుంది. ఈ సందర్భంగా రాష్ట్రం తరపున అజెండాలో 19 అంశాలను పొందుపరిచారు.

Read Also: Nandamuri Balakrishna: బ్రేకింగ్.. బాలకృష్ణ నిర్మాతలకు సుప్రీం కోర్టు నోటీసులు

కాగా రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు అయినా ఇంకా సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని.. ఈ విషయాన్ని జోనల్‌ కమిటీ సమావేశంలో ప్రస్తావించాలని సీఎం జగన్ సూచించారు. పరిష్కారం కోసం ఈ సమావేశంలో దృష్టి పెట్టాలన్నారు. పరిష్కారాలను సూచించే వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిందిగా కోరాలన్నారు. పరిష్కారాలు చూపించడమే కాకుండా తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేదిగా ఉండాలంటూ గట్టిగా డిమాండ్‌ చేయాలని తెలిపారు. విభజన వల్ల రాష్ట్రం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిందని.. హైదరాబాద్‌ లాంటి నగరాన్ని కోల్పోయిందని పేర్కొన్నారు. విభజన సమస్యల పరిష్కారంలో ఆలస్యం అవుతున్న కొద్దీ రాష్ట్రానికి తీవ్రంగా నష్టం జరుగుతోందని జగన్ అన్నారు. అందుకే వీటి పరిష్కారంపై దృష్టి పెట్టాల్సిందిగా సమావేశంలో గట్టిగా ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి తగిన నిధులు విడుదల చేసే అంశాన్ని కూడా అజెండాలో ఉంచాలని సీఎం జగన్ పేర్కొన్నారు.

Exit mobile version