మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడికి సీఎం జగన్ షాకిచ్చారు. ఆయన్ను వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని క్రమశిక్షణా కమిటీ సిఫార్సు చేయడంతో కొత్తపల్లిని జగన్ సస్పెండ్ చేశారు. తనకు వ్యక్తిగత ఓటు బ్యాంక్ ఉందని, వచ్చే ఎన్నికల్లో పార్టీలతో సంబంధం లేకుండా తనకు ఓట్లు పడతాయని మంగళవారం నాడు కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రకటించారు. అంతేకాకుండా పార్టీ ప్రకటించకుండా తాను వచ్చే ఎన్నికల్లో నరసాపురం నుంచి బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. అలాగే కొన్ని రోజులుగా స్థానిక వైసీపీ ఎమ్మెల్యేపై కొత్తపల్లి సుబ్బారాయుడు విమర్శలు చేస్తున్నారు. దీంతో వైసీపీ నుంచి ఆయన్ను బహిష్కరిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.
కాగా గతంలో కొత్తపల్లి సుబ్బారాయుడు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఓ సారి ఎంపీగా విజయం సాధించారు. అయితే కొంతకాలంగా నర్సాపురం నియోజకవర్గంలో మాజీ మంత్రి కొత్తపల్లి సబ్బారాయుడు, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు మధ్య వర్గపోరు నడుస్తోంది. కొత్త జిల్లాల విషయంలో నర్సాపురాన్ని జిల్లా కేంద్రం చేయడంలో ప్రసాదరాజు విఫలమయ్యారని కొత్తపల్లి ఆరోపించారు. అంతేకాకుండా నిరసన కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. దీంతో సీరియస్ అయిన వైసీపీ అధిష్టానం ఇటీవల కొత్తపల్లి సుబ్బారాయుడికి ప్రభుత్వం గన్‌మెన్లను కూడా తొలగించింది.