NTV Telugu Site icon

CM Jagan: TMF, SMFల కోసం ప్రతి అక్కచెల్లెమ్మ రూ.2వేలు ఇవ్వాలి

Cm Jagan

Cm Jagan

శ్రీకాకుళం జిల్లా పర్యటనలో జగనన్న అమ్మ ఒడి నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. 43 లక్షల 96 వేలమంది తల్లుల ఖాతాల్లో నేరుగా రూ.6,595 కోట్లను జమ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అమ్మ ఒడి స్కీం ద్వారా గత మూడేళ్లలో అక్క చెల్లెమ్మల ఖాతాలలో మొత్తం రూ.19,618 కోట్లను జమ చేశామని తెలిపారు. ప్రతి తల్లి తమ బిడ్డలను మంచిగా చదివించాలని తాపత్రయపడుతుందని.. అలాంటి వాళ్లకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని సీఎం జగన్ అన్నారు. అందుకే పిల్లలను బడికి పంపిస్తే ప్రతి ఏటా రూ.15వేలు అందిస్తున్నామన్నారు. ఎంత ఎక్కువ మంది చదివితే తనకు అంత ఎక్కువ ఆనందం కలుగుతుందన్నారు. పిల్లలు బడికి వెళ్తేనే ఈ పథకం వస్తుందని ఆనాడే జీవో ఇచ్చామని సీఎం జగన్ పేర్కొన్నారు. 75 శాతం హాజరు తప్పనిసరి చేసింది పిల్లలందరూ స్కూలుకు వెళ్లాలనే ఉద్దేశంతోనే అని స్పష్టం చేశారు. ఈ నిబంధన అమలు చేయడంతోనే 51వేల మంది పిల్లలకు అమ్మ ఒడి ఇవ్వలేకపోయామన్నారు. 1.14 శాతం మందికి ఈ పథకం డబ్బులు ఇవ్వలేకపోవడం చాలా బాధగానే ఉందన్నారు. భవిష్యత్‌లో 75 శాతం హాజరు ఉండాలంటే ఈ నిబంధన కఠినంగా అమలు చేయాలనే బాధ్యతతో పనిచేస్తున్నందున అందరికీ న్యాయం చేయలేకపోతున్నామని తెలిపారు.

మరోవైపు చదువుకునే చిన్నారులందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే తమ ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం జగన్ వెల్లడించారు. ప్రతి పిల్లాడు , పాప బ్రతుకు మారాలని తపనతోనే అడుగులు వేస్తున్నామన్నారు. అమ్మ ఒడి , నాడు నేడు , విద్యాకానుక, గోరుముద్ద వంటి పథకాలను అమలు చేస్తున్నామని.. ఇటీవల బైజూస్‌తో కూడా ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల విద్యలో మరింత నాణ్యత పెరుగుతుందని సీఎం జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలంటే టాయ్‌లెట్లు శుభ్రంగా ఉండటం చాలా ముఖ్యమని.. అందుకే అమ్మ ఒడి ద్వారా ఇచ్చే నిధుల్లో కొన్ని నిధులను టాయ్‌లెట్ మెయింటెన్స్ ఫండ్ (TMF) కింద మినహాయించుకుంటున్నామని జగన్ వివరించారు. అటు నాడు నేడు కింద స్కూళ్ల రూపురేఖలను మార్చేశామని.. కానీ ఈ స్కూళ్లను అలాగే వదిలేస్తే మరో నాలుగేళ్లలో పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందని.. అలా జరగకుండా స్కూల్ మెయింటెన్స్ ఫండ్ (SMF) కింద కూడా కొంత మినహాయించుకున్నట్లు తెలిపారు. TMF, SMFల కోసం ప్రతి అక్కచెల్లెమ్మ అమ్మ ఒడి నిధుల నుంచి రూ.2వేలు ఇవ్వాలని సీఎం జగన్ కోరారు.

అటు అధికారంలోకి వచ్చిన మూడేళ్లుగా పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నట్లు సీఎం జగన్ గుర్తుచేశారు. కుటుంబం , దేశం తలరాతలు మార్చగలిగేది ఒక్క చదువే అని.. చదువులు ఎక్కువ ఉన్న దేశాలలో ఆదాయాలు ఎక్కువ ఉన్నాయని జగన్ తెలిపారు. తలసరి ఆదాయం ఎక్కువ ఉండటానికి కారణం చదువే అన్నారు. చదువే నిజమైన ఆస్తి అని.. చదువుపై ఖర్చు చేసే ప్రతి పైసా పవిత్రమైన పెట్టుబడితో సమానమన్నారు. ఒకతరాన్ని , మనిషి తలరాతలను మార్చే శక్తి విద్యకే ఉందని జగన్ అన్నారు. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లినా బ్రతికే సత్తా చదువుతోనే వస్తుందన్నారు. దేశంలో అన్ని రాష్ర్టాల కంటే మిన్నగా మన పిల్లల చదువులు ఒక హక్కుగా అందాలని ముందుకు వెళ్తున్నామని జగన్ పేర్కొన్నారు.